- దీవిని సీజ్ చేసి హార్మూజ్ జలసంధి రీఓపెనింగ్ కోసం ఇరాన్‌పై ఒత్తిడికి వ్యూహం
- దీనికి ఒక నెల సరిపోతుందన్న అమెరికా అధ్యక్షుడు
- ఏక్సియోస్ వార్తా సంస్థ కథనం
వాషింగ్టన్: ఇరాన్‌కు చెందిన అత్యంత కీలక ప్రాంతం ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ఏక్సియోస్ వార్తా సంస్థ శుక్రవారం ఒక కథనం వెలువరించింది.
ఇరాన్ కు వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకునో లేక అడ్డుకోవడం ద్వారానో హార్మూజ్ జలసంధిని తెరిపించేలా ఇరాన్ పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ ప్లాన్ వేశారని ఆ రిపోర్టు వెల్లడించింది.
జలరవాణాకు కీలకంగా ఉన్న ఖర్గ్ దీవిపై ఇరాన్ ఆధిపత్యాన్ని చాలెంజ్ చేయాలని ట్రంప్ పాలకవర్గం భావిస్తోందని తెలిపింది. ‘‘ఇరాన్ పై మరిన్ని దాడులు చేసి ఆ దేశ బలగాలను మరింత బలహీనం చేసి ఖర్గ్ ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాం. ఇందుకోసం మాకు ఒక నెల అవసరం. ఈ ఆపరేషన్ కు ఆమోదం లభిస్తే, యుద్ధంలో యూఎస్ మిలిటరీ జోక్యం మరింత పెరుగుతుంది.
ఇప్పటికే వివిధ మెరైన్ యూనిట్లు ఖర్గ్ ఐలాండ్ ప్రాంతానికి బయల్దేరాయి. మరిన్ని బలగాలను పంపడంపై వైట్ హౌస్ ఆలోచిస్తున్నది” అని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నట్లు ఆ కథనం తెలిపింది. ‘‘హార్మూజ్ జలసంధిని ట్రంప్ రీఓపెన్ చేయించాలనుకుంటున్నరు. ఖర్గ్ ఐలాండ్‌పై దాడి చేయాలని ఫిక్స్ అయ్యారు. త్వరలోనే అది జరగబోతోంది” అని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు ఏక్సియోస్ వార్తా సంస్థకు చెప్పారు. కాగా.. ఖర్గ్ ఐలాండ్ ఇరాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ క్రూడాయిల్ ఎగుమతుల్లో 90% ఈ దీవి ద్వారానే జరుగుతోంది. కాగా, ఖర్గ్ ఐలాండ్ సీజ్ కోసం
ప్రయత్నిస్తే యుద్ధం మరింత తీవ్రంగా మారుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హార్మూజ్ దిశగా 3 యుద్ధ నౌకలు
పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక శక్తిని మరింత పెంచింది. తాజాగా 3 యుద్ధ నౌకల తో పాటు సుమారు 2,500 మంది అదనపు మెరైన్ సైనికులను పశ్చిమాసియాకు పంపుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. కాలిఫోర్నియా పోర్ట్ నుంచి యూఎస్ ఎస్ బాక్సర్ నేతృత్వంలోని ఈ యుద్ధ నౌకలు బయలుదేరాయి.
ఇరాన్ తీరప్రాంతంలో పెరుగుతున్న ముప్పును తిప్పికొట్టడమే లక్ష్యంగా పెంటగాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధిలో ఇరాన్ చేస్తున్న దాడులకు అడ్డుకట్ట వేయడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ఇరాన్ చర్యల వల్ల అస్తవ్యస్తమైంది. ఈ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర భారీగా పెరుగుతోంది.
