V6 News

చమురు ధరలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన

చమురు ధరలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన
  • మేం ఇప్పుడు వెనక్కి తగ్గినా.. ఇరాన్‌‌‌‌ కోలుకోవాలంటే మరో 20 ఏండ్లు పడ్తుంది: ట్రంప్‌‌‌‌
  • అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే ఇరాన్‌‌‌‌ అణ్వాయుధాలు తయారుచేసేది
  • ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయం..
  • రాబోయే రెండు రోజుల్లోనే ఇస్లామాబాద్‌‌‌‌లో మరోసారి చర్చలు!
  • ఇరాన్‌‌‌‌కు చైనా ఆయుధాలను పంపదు.. జిన్‌‌‌‌పింగ్‌‌‌‌ నాకు హామీ ఇచ్చారు
  • యుద్ధం ముగియగానే చమురు ధరలు భారీగా తగ్గుతాయని వెల్లడి

వాషింగ్టన్: ఇరాన్‌‌తో నెలకొన్న యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము గనక ఇప్పుడు వెనక్కి తగ్గినా.. ఇరాన్ తిరిగి కోలుకోవడానికి మరో 20 ఏండ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం ‘మార్నింగ్స్ విత్ మరియా’ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై పలు కీలక విషయాలను వెల్లడించారు.

హార్మూజ్‌‌ జలసంధి గుండా వెళ్లే నౌకలకు భద్రత కల్పించే చర్యల్లో భాగంగా.. గత 24 గంటలుగా ఇరాన్ పోర్ట్‌‌లను అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా దిగ్బంధించిందని వెల్లడించారు. ఒకవేళ తాను ఈ కఠిన నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే.. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను తయారు చేసుకునేదని ఆయన పేర్కొన్నారు. హార్మూజ్‌‌ దిగ్బంధం విజయవంతమైందని వైట్ హౌస్ ప్రకటించిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

ఇరాన్‌‌తో మళ్లీ చర్చలు..
ఇరాన్‌‌తో నెలకొన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు గత వారాంతంలో ఇస్లామాబాద్‌‌లో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ, రెండో విడత డిస్కషన్స్‌‌ జరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండు రోజుల్లోనే ఇస్లామాబాద్‌‌లో ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చేస్తున్న కృషిని ట్రంప్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఇరాన్‌‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు.‘‘ఇరాన్ విజయం సాధించిందని వారు భావించడం నాకు ఇష్టం లేదు. వారికి ఎలాంటి వెసులుబాటు ఇచ్చే ప్రసక్తే లేదు” అని వ్యాఖ్యానించారు. అయితే, రెండో విడత చర్చలకు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ట్రంప్‌‌ స్పష్టత ఇవ్వలేదు.  

జిన్‌‌పింగ్‌‌తో సంప్రదింపులు జరిపా.. 
ఇరాన్‌‌కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తోందన్న వార్తల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.  ఇరాన్‌‌కు చైనా ఎలాంటి ఆయుధాలను పంపడం లేదని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తమ మధ్య లేఖల ద్వారా సంప్రదింపులు జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. ఫాక్స్ బిజినెస్ నెట్‌‌వర్క్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను ఆయనకు (జిన్‌‌పింగ్‌‌కు) ఒక లేఖ రాశాను. ఇరాన్‌‌కు ఆయుధాలు పంపవద్దని కోరాను. దానికి సమాధానంగా ఆయన కూడా లేఖ రాస్తూ.. తాము అలాంటి పనులేవీ చేయడం లేదని స్పష్టం చేశారు’’ అని తెలిపారు.  

చైనా చాలా సంతోషంగా ఉంది
హార్మూజ్​ జలసంధి అంశంపైనా చైనా స్పందనపై ట్రంప్‌‌ ట్రూత్‌‌ సోషల్​మీడియా వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.  ఇకపై ఈ జలసంధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ‘‘చైనా అధ్యక్షుడు జిన్‌‌పింగ్ మరికొన్ని వారాల్లో నన్ను కలవబోతున్నారు. హార్మూజ్ జలసంధిని నేను శాశ్వతంగా తెరిపిస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రపంచం కోసమే కాకుండా వారి కోసం కూడా చేస్తున్నాను. యుద్ధం కంటే కలిసి పనిచేయడమే మంచిది కదా!’’ అని రాసుకొచ్చారు. 

మే 14, 15 తేదీల్లో చైనా పర్యటనకు వెళ్తున్నానని, చైనా అధ్యక్షుడు షీ జిన్‌‌పింగ్ తనకు ‘పెద్ద హగ్’  ఇస్తారని, తామిద్దరం కలిసి తెలివిగా పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రకటనలు ఇలా ఉంటే, చైనా మాత్రం అమెరికా తీరును తప్పుపడుతున్నది. ఇరాన్ పోర్ట్‌‌లపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు, దిగ్బంధాలను ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రవర్తన ‘ప్రమాదకరం, బాధ్యతారాహిత్యం’ అని వ్యాఖ్యానించింది.  కాగా, ఇరాన్ యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు భారీగా తగ్గుతాయని, ఆ సమయం ఎంతో దూరంలో లేదని  ట్రంప్ పేర్కొన్నారు.   

పశ్చిమాసియాకు 10 వేల మంది సైనికులు
యుద్ధం త్వరలో ముగియనుందని ట్రంప్ చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే, మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా బలగాలను మోహరిస్తోంది. దాదాపు 10 వేల మంది అదనపు సైనికులను  పంపుతున్నట్టు పెంటగాన్‌‌ ప్రకటించింది. యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్ నౌక ద్వారా 6,000 మంది,  బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్ ద్వారా మరో 4,200 మంది సైనికులను తరలిస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే  అక్కడ 3 అమెరికా యుద్ధ నౌకలు ఉన్నాయి.