టారిఫ్లకు వ్యతిరేకులు మూర్ఖులు!..ఒక్కో అమెరికన్కు 2 వేల డాలర్లు ఇస్తాం: ట్రంప్

టారిఫ్లకు  వ్యతిరేకులు మూర్ఖులు!..ఒక్కో అమెరికన్కు  2 వేల డాలర్లు ఇస్తాం: ట్రంప్

వాషింగ్టన్:  ప్రపంచ దేశాలపై తాను విధిస్తున్న టారిఫ్ లకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులని ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. టారిఫ్ లు వేయడం ద్వారా లక్షల కోట్ల డాలర్లు వస్తాయని.. ఆ డబ్బుతో రుణాలు తిరిగి చెల్లించడంతోపాటు అమెరికన్లకు ఒక్కొక్కరికి 2 వేల డాలర్ల చొప్పున ఇస్తామన్నారు. ఆదివారం సాయంత్రం తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ మేరకు పోస్ట్ పెట్టారు.

 టారిఫ్ ల సొమ్ముతో అమెరికా మరింత స్ట్రాంగ్ గా, సంపన్నంగా మారుతుందన్నారు. ‘‘టారిఫ్ లను వ్యతిరేకించేవాళ్లు ఫూల్స్! నా నాయకత్వంలో అమెరికా అత్యంత సంపన్న దేశంగా, అత్యంత గౌరవప్రదమైన దేశంగా మారింది. ద్రవ్యోల్బణం దాదాపుగా లేదు. స్టాక్ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. టారిఫ్ ల వల్ల లక్షల కోట్ల డాలర్లు వస్తున్నాయి. ఈ డబ్బుతో 37 ట్రిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించడం కూడా ప్రారంభిస్తాం. అంతేకాదు.. ప్రతి ఒక్క అమెరికన్ కూ(హై ఇన్ కమ్ ఉన్నవారికి కాదు!) కనీసం 2 వేల డాలర్ల చొప్పున డివిడెండ్ ఇస్తాం” అని ట్రంప్ ప్రకటించారు. తన విధానంతో అమెరికాలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, దేశమంతటా ఫ్యాక్టరీలు, ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయని పేర్కొన్నారు.