- గల్ఫ్ లో మరోసా రి టెన్షన్
- ఆ డ్రోన్ మాది కాదు..మీదే
వాషింగ్టన్: హార్ముజ్ జలసంధి దగ్గర తమ భూభాగంలోకి వచ్చిన ఇరాన్ డ్రోన్‌ను నేవల్‌ఫోర్స్ కూల్చేసినట్టు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా నేవీకి చెందిన షిప్ ‘యూఎస్‌ఎస్ బాక్సర్’ హార్ముజ్ జలసంధి దగ్గర అంతర్జాతీయ జలాల మీదుగా వెళ్తున్నప్పుడు ఇరాన్‌కు చెందిన డ్రోన్ 914 మీటర్ల సమీపంలోకి వచ్చినట్టు చెప్పారు. పలుమార్లు హెచ్చరికలు చేసినా వెనక్కి తగ్గకపోవడంతో ఇరాన్ డ్రోన్‌ను కూల్చేసినట్టు మీడియాకు ట్రంప్ చెప్పారు. అంతర్జాతీయ జలాల్లో తిరుగుతున్న షిప్‌లను ఇరాన్ టార్గెట్ చేసుకుంటోందని చెప్పడానికి ఇదే సాక్ష్యమన్నారు. అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఇరాన్ ప్రవర్తిస్తున్న తీరును అన్ని దేశాలు ఖండించాలని పెంటగాన్ ప్రతినిధి జోనాథన్ హాఫ్‌మన్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. తమ దేశానికి చెందిన డ్రోన్‌ను అమెరికా కూల్చినట్టు చెబుతున్న వార్తల్ని ఇరాన్ ఖండించింది. దీనిపై ఎటువంటి ఆధారాలు లేవని ఇరాన్ విదేశీ వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ అబ్బాస్ అరాగ్‌చీ ట్విట్టర్‌లో వెల్లడించారు. బహుశా అమెరికా దళాలు పొరపాటున వాళ్ల డ్రోన్‌నే కూల్చేసి ఉంటాయని, ఇరాన్ తమ డ్రోన్‌ను కూల్చలేదని తెలిపారు.
ఉద్రిక్తతల పరంపర
గత ఏడాది ఇరాన్‌తో అణు ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన నాటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఇరాన్ ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకోకుండా ఆయా దేశాలపై అమెరికా ఆంక్షలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఆయిల్ రవాణా చేస్తున్న రెండు నౌకలపై దాడి జరిగింది. అది ఇరాన్ పనేనని అమెరికా ఆరోపించింది. వాటిని ఇరాన్ తోసిపుచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే అమెరికా నిఘా డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ఎయిర్‌స్పేస్ నుంచి అమెరికా తమ విమానాల రాకపోకలను ఆపేసుకుంది. ప్రస్తుత ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.
