- పూర్తి స్థాయి ఒప్పందం జరిగే వరకు అక్కడే ఉంటయ్: ట్రంప్
- ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మునుపెన్నడూ లేనివిధంగా
- దాడులు చేస్తం మరో విజయం కోసం అమెరికా
- ఆర్మీ సిద్ధమవుతున్నదని వెల్లడి
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరి.. అది అమలయ్యే వరకు అమెరికా బలగాలు ఇరాన్ పరిసరాల్లోనే ఉంటాయని తెలిపారు. అమెరికాకు చెందిన నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది పూర్తి ఆయుధ సంపత్తితో అక్కడే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. రెండు వారాల కాల్పుల విరమణ తర్వాత ఒక పూర్తిస్థాయి ఒప్పందం జరుగుతుందని.. ఒకవేళ అది విఫలమైతే గతంలో ఎన్నడూ చూడని విధంగా విరుచుకుపడతామని, అత్యంత శక్తివంతమైన దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలు ఉండకూడదని.. అలాగే, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి సురక్షితంగా, తెరిచి ఉండాలని ఇప్పటికే ఒప్పందం కుదిరిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే గణనీయంగా బలహీనపడిన శత్రువును తుదముట్టించడానికి అవసరమైన అన్ని రకాల ఆయుధాలతో అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ట్రంప్ తెలిపారు. ‘‘మా గొప్ప సైన్యం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోంది. తదుపరి విజయం కోసం ఎదురుచూస్తోంది. అమెరికా మళ్లీ పుంజుకుంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
మీడియాపై ట్రంప్ ఆగ్రహం
ఇరాన్ చర్చలకు సంబంధించి మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు. ముఖ్యంగా 'న్యూయార్క్ టైమ్స్', 'సీఎన్ఎన్' వంటి మీడియా సంస్థలు ప్రచురించిన 10 అంశాల ప్రణాళిక ఒక పెద్ద మోసమని, అది శాంతి ప్రక్రియను దెబ్బతీసే ప్రయత్నమని ఆయన విమర్శించారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళిక ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ట్రంప్ దానిని తిరస్కరించి చెత్తబుట్టలో వేశారని తెలిపారు. ఇరాన్ బహిరంగంగా చెప్పే మాటలకు, ప్రైవేటుగా అమెరికాతో జరిపే చర్చలకు చాలా తేడా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మీడియా తప్పుడు కథనాలను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు.
