ఇరాన్ ను ఆక్రమిస్తాం..ఒక్కరాత్రిలోనే ఆ దేశం తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్

ఇరాన్ ను  ఆక్రమిస్తాం..ఒక్కరాత్రిలోనే ఆ దేశం తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్
  • ఒక్కరాత్రిలోనే ఆ దేశం తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్‌‌
  • ఆ దేశ మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తం 
  • ఇరాన్​కు విధించిన గడువు పొడిగింపు లేదు
  • అక్కడ చిక్కుకున్న మా వెపన్‌‌ సెక్షన్‌‌ ఆఫీసర్‌‌‌‌ను కాపాడుకున్నం
  • మేం ప్రయోగించిన వేల విమానాల్లో ఒక్కటి మాత్రమే కోల్పోయాం
  • ఏ దేశానికి లేని ఆయుధ సంపద అమెరికాకు ఉన్నది
  • 4 బాంబర్లు, 13 రెస్క్యూ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌లతో ఆపరేషన్ ​చేపట్టాం
  • 155 ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌‌లతో రెండో రెస్క్యూ ఆపరేషన్​ చేపట్టామని వెల్లడి
  • మిలిటరీ రెస్క్యూను అభినందించిన ట్రంప్​
  • వైట్​హౌస్​లో ఈస్టర్​ కార్యక్రమంలో ప్రసంగం

వాషింగ్టన్‌‌: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను తాజాగా ఇరాన్‌‌ తిరస్కరించిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. మంగళవారం రాత్రి వరకు ఇరాన్‌‌ను పూర్తిగా ఆక్రమిస్తామని వార్నింగ్‌‌ ఇచ్చారు. ఆ దేశాన్ని ఒక్క రాత్రిలో నామరూపాలు లేకుండా చేసే సత్తా అమెరికాకు ఉందని, ఆ రాత్రి రేపే (మంగళవారం) కావచ్చని హెచ్చరించారు. ఇరాన్‌‌కు తాము ఇచ్చిన గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైట్‌‌హౌస్‌‌లో ఈస్టర్ వేడుకల సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇరాన్‌‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ దేశాన్ని ఒక్క రాత్రిలోనే మట్టుబెట్టగలం.  రేపు రాత్రికి ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చు. ఆ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలు, కీలక మౌలిక సదుపాయాలపై భీకర దాడులు చేస్తాం. హార్మూజ్‌‌ జలసంధిని వెంటనే తెరవకపోతే వారు నరకాన్ని చూడటం ఖాయం’’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 


ప్రపంచంలో ఏ దేశానికి లేని అత్యాధునిక ఆయుధ సంపద అమెరికా సొంతమని ట్రంప్‌‌ గర్వంగా ప్రకటించారు. ఇరాన్ గడ్డపై చిక్కుకున్న అమెరికా వెపన్ సెక్షన్ ఆఫీసర్‌‌ను రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించి కాపాడుకున్నామని తెలిపారు. ఇరాన్‌‌ గగనతలంతోకి  తమ ఎఫ్‌‌ 15 యుద్ధ విమానం దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం 4 బాంబర్లు, 13 రెస్క్యూ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌లను ఉపయోగించగా, రెండో రెస్క్యూ ఆపరేషన్‌‌లో ఏకంగా 155 యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్లు ట్రంప్ వివరించారు. తాము వేల సంఖ్యలో విమానాలను ప్రయోగించినా, కేవలం ఒక్క విమానాన్ని మాత్రమే కోల్పోయామని, తమ సైనికులను క్షేమంగా వెనక్కి తీసుకురావడమే తమకు ముఖ్యమని  అన్నారు. అమెరికా సైన్యం ఇప్పటి వరకు చేపట్టిన అత్యంత భారీ, సంక్లిష్టమైన ఆపరేషన్‌‌ ఇదని, ప్రమాదకరంగా సాగిన గాలింపు చర్యల్లో విజయం సాధించామని చెప్పారు.

మంగళవారం రాత్రి 8 గంటలే డెడ్‌‌లైన్!

మంగళవారం రాత్రి 8 గంటల (ఈస్టర్న్ టైమ్) లోపు ఇరాన్ దిగిరావాలని ట్రంప్‌‌ అల్టిమేటం ఇచ్చారు. ‘‘అది వారికి చివరి అవకాశం. ఇప్పటికే 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చింది.. కానీ అది మాకు సరిపోదు. నేనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాను’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా సైన్యం సాహసాన్ని అభినందిస్తూ.. ‘‘మేం ఏ ఒక్క అమెరికన్ సైనికుడిని శత్రువుల చేతిలో వదిలిపెట్టం’’ అని భావోద్వేగంగా ప్రసంగించారు. అమెరికా మిలిటరీ రెస్క్యూను ట్రంప్‌‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. మంగళవారం 
రాత్రి అమెరికా ఎలాంటి చర్యకు దిగబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

వెనక్కి తగ్గేదే లేదు..

టెహ్రాన్‌‌‌‌: ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తేలికగా తీసుకున్నది. తాము ట్రంప్‌‌‌‌ వ్యాఖ్యలకు భయపడి వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఖాలిబాఫ్ స్పందిస్తూ.. ‘‘అమెరికా తన నిర్ణయాలతో ప్రతి అమెరికన్ కుటుంబాన్ని నరకంలోకి నెడుతున్నది. ఇది ఇజ్రాయెల్‌‌‌‌ ప్రధాని నెతన్యాహు ఆడుతున్న గేమ్. మీరు యుద్ధ నేరాల ద్వారా ఏమీ సాధించలేరు’’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ అమెరికా దాడులు మొదలుపెడితే.. ఇజ్రాయెల్‌‌‌‌తో పాటు కువైట్, యూఏఈ, బహ్రెయిన్‌‌‌‌లాంటి గల్ఫ్ దేశాల్లోని కీలక వ్యవస్థలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు.