- అణుబాంబులు తయారు చేయొద్దు..
- హార్మూజ్‌ను రీఓపెన్ చేయాలి
- టెర్రర్ గ్రూపులను పెంచి పోషించొద్దని కండిషన్
- చర్చలకు వీలుగా నెల రోజుల కాల్పుల విరమణ
- అమెరికాకు ఇరాన్ రిటర్న్ కండిషన్లు
- గల్ఫ్‌లో అమెరికా బేస్‌లు మూసేయాలి
- మాపై ఆంక్షలు ఎత్తేయాలి.. హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలి
- హార్మూజ్‌లో ట్రాన్సిట్ ఫీజుకు అనుమతివ్వాలని షరతులు
- చర్చల ప్రతిపాదనలు వచ్చినా.. కొనసాగిన దాడులు, ప్రతిదాడులు
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్:యుద్ధాన్ని ఆపాలంటే 15 షరతులకు అంగీకరించాలంటూ ఇరాన్కు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ పంపారు. అణు బాంబుల తయారీని ఇరాన్ పక్కనపెట్టాలని, హార్మూజ్ జలసంధిని రీఓపెన్ చేయాలని.. హిజ్బుల్లా వంటి ప్రాక్సీ టెర్రర్ గ్రూపులను పెంచి పోషించొద్దని కండిషన్లు పెట్టారు. శాంతి ఒప్పందంపై చర్చించేందుకు వీలుగా నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలనీ ఈ ప్రతిపాదనలో పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ కూడా ట్రంప్‌కు రిటర్న్ కండిషన్లు పెడుతూ ప్రపోజల్ పంపింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‌లను మూసేయాలని, ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తేయాలని, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని.. హార్మూజ్‌లో నౌకలపై ట్రాన్సిట్ ఫీజు విధించేందుకు అనుమతివ్వాలని షరతులు పెట్టింది.
ఒకవైపు చర్చలకు ప్రతిపాదనలు కొనసాగుతుండగానే మరోవైపు, బుధవారం కూడా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ పై, లెబనాన్ లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేయగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తోపాటు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలపై ప్రతిదాడులు చేసింది. ఇంకోవైపు అమెరికా చర్చలంటూనే.. వేలాది మంది పారాట్రూపర్లు, అదనపు మెరైన్ బలగాలను పర్షియన్ గల్ఫ్‌కు తరలిస్తుండటంతో శాంతి చర్చలపై అయోమయం నెలకొంది.
చర్చల కోసం నెల రోజుల కాల్పుల విరమణ
పశ్చిమాసియా సంఘర్షణను ముగించేందుకు అమెరికా రూపొందించిన15 అంశాల ప్రణాళికను ఇరాన్కు చేరవేశామని పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధానంగా ఇరాన్‌పై ఆంక్షల తొలగింపు, అణు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవడం, క్షిపణి వ్యవస్థపై పరిమితులు, హార్మూజ్ జలసంధిని పునఃప్రారంభించడం వంటి అంశాలు ఉన్నట్లు తెలిపారు.
]మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో పాల్గొంటున్న ఈజిప్ట్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సాయుధ గ్రూపులకు ఇరాన్ అందిస్తున్న మద్దతుపై పరిమితులు విధించే అంశంకూడా ఉందన్నారు. అలాగే, చర్చల కోసం నెల రోజుల పాటు కాల్పుల విరమణ జరగాలని అమెరికా కోరుతోంది. ప్రతిగా, ఇరాన్‌పై ఆంక్షలను పాక్షికంగా తొలగించడం, ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ఇరాన్ వెలుపల ఇంధన కేంద్రంతో కూడిన పౌర అణు కార్యక్రమానికి అనుమతివ్వడం, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సహకరించడం వంటివి ఆఫర్ చేస్తోంది. అయితే, అమెరికా సీజ్ఫైర్ ప్రతిపాదనను చూసి ఇజ్రాయెల్ నాయకత్వం ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది.
ఇరాన్ నుంచీ కఠిన షరతులు..
ట్రంప్ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా కఠినమైన షరతులు విధించినట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను మూసివేయాలని, ఇరాన్‌పై విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసినట్టు తెలిపింది. లెబనాన్‌లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని.. హార్మూజ్ జలసంధిలో రవాణా రుసుము వసూలు చేసేందుకు తమకు అనుమతివ్వాలనీ కండిషన్లు పెట్టిందని పేర్కొంది. అదేసమయంలో అమెరికా చేసిన ఇలాంటి ప్రతిపాదనలకు ఇరాన్ ఇదివరకే నో చెప్పింది.
తమ రక్షణకు కీలకమైన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం లేదా ప్రాంతీయ మిలీషియా గ్రూపులకు ఇచ్చే మద్దతుపై చర్చించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. హార్మూజ్ జలసంధిపై నియంత్రణ తన అతిపెద్ద వ్యూహాత్మక బలమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందంలోని నిబంధనలకూ ఇరాన్ అంగీకరించే అవకాశంలేదని చెప్తున్నారు. అలాగే, ట్రంప్ ప్రతిపాదిస్తున్న ఈ 15 అంశాల ప్లాన్ పూర్తిగా కొత్తదేమీ కాదని కూడా దౌత్యవేత్తలు అంటున్నారు.
2025 మే నెలలో అణు చర్చల సమయంలో సిద్ధం చేసిన పత్రాల ఆధారంగానే దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత ఆ చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి అమెరికా అదనపు బలగాలను మోహరిస్తుండటంతో, పరిస్థితి తీవ్రతరం అయితే గల్ఫ్ ప్రాంతంలో మైన్లను అమర్చుతామని ఇరాన్ హెచ్చరించింది.
చర్చలకు పాకిస్తాన్ వేదిక?
ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య పాకిస్తాన్లో బహుశా శుక్రవారం నాడే ప్రత్యక్ష చర్చలు జరిపించేందుకు మధ్యవర్తులు ఒత్తిడి తెస్తున్నారని ఈజిప్ట్, పాకిస్తాన్ అధికారులు చెప్పారు. అలాగే యుద్ధాన్ని ముగించేందుకు ‘అర్థవంతమైన, నిర్ణయాత్మకమైన చర్చలకు’ తాము సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన పోస్ట్‌ను ట్రంప్ తన 'ట్రూత్ సోషల్'లో షేర్ చేశారు.
మంగళవారం వైట్ హౌస్ లో కూడా ఆయన మాట్లాడుతూ.. అమెరికా ప్రస్తుతం "చర్చలు జరుపుతోంది" అని, ఇందులో ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. ‘మా వైపు నుంచి చాలా మంది ఈ పనిలో ఉన్నారు. అవతలి పక్షం కూడా ఒప్పందం చేసుకోవడానికి ఇష్టపడుతోందని నేను చెప్పగలను’అని ట్రంప్ పేర్కొన్నారు. కానీ, అటు ఇరాన్ సైన్యం, పారామిలటరీకి చెందిన ఐఆర్జీసీ పర్యవేక్షణలో ఉండే ఖాటమ్ అల్-అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయం మాత్రం చర్చల ఆలోచనను తోసిపుచ్చింది.
గల్ఫ్ కు మరిన్ని అమెరికా బలగాలు
అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో ఉన్న 50,000 మంది సైనికులకు అదనంగా మరో 3,000 మందిని అక్కడకు పంపుతోంది. పశ్చిమాసియాకు రానున్న రోజుల్లో 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుంచి కనీసం 1,000 మంది పారాట్రూపర్లను పంపనున్నట్లు సీజ్ ఫైర్ ప్రణాళికలతో సంబంధమున్న ముగ్గురు వ్యక్తులు ‘అసోసియేటెడ్ ప్రెస్’కు తెలిపారు. వీరితో పాటు నీటిపై, భూమిపై దాడులు చేయడంలో ఆరితేరిన సుమారు 5,000 మంది అదనపు మెరైన్ బలగాలను, వేల సంఖ్యలో నావికా దళ సైనికులను అమెరికా రక్షణ శాఖ పశ్చిమాసియాకు పంపుతోంది.
కొనసాగిన దాడులు, ప్రతిదాడులు
ఇరాన్ లోని ప్రభుత్వ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున భారీ ఎత్తున దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఖాజ్వీన్ సిటీలో వైమానిక దాడులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇటు ఇరాన్ కూడా ఎదురుదాడులు చేస్తుండటంతో ఇజ్రాయెల్‌లో క్షిపణి హెచ్చరిక సైరన్లు పలుమార్లు మోగాయి. పొరుగు దేశాలపై కూడా ఇరాన్ ఒత్తిడిని కొనసాగిస్తోంది. బహ్రెయిన్‌లో కూడా క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగాయి.
ఈ యుద్ధంలో ఇరాన్ లో మరణాల సంఖ్య 1,500 దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో 16 మంది మరణించారు. 13 మంది అమెరికా సైనికులతో పాటు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గల్ఫ్ అరబ్ దేశాల్లో పదుల సంఖ్యలో పౌరులు చనియారు. లెబనాన్‌లో హిజ్బుల్లా లక్ష్యంగా జరిగిన దాడుల్లో 1,000 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు.
