48 గంటల్లో హార్మూజ్ తెరవాలి.. లేదంటే పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం: ట్రంప్

48 గంటల్లో హార్మూజ్ తెరవాలి.. లేదంటే పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం: ట్రంప్
  • ఇరాన్‌‌‌‌‌‌‌‌కు యూఎస్ ప్రెసిడెంట్ 
  • ట్రంప్ హెచ్చరిక
  • అట్లైతే మొత్తానికే మూస్తం: ఇరాన్​

వాషింగ్టన్/టెహ్రాన్: ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన హార్మూజ్ జలసంధిని నౌకల రాకపోకల కోసం వెంటనే తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేసి సర్వనాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ అల్టిమేటంపై స్పందించిన ఇరాన్ సైన్యం.. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికాకు చెందిన ఇంధన, సాంకేతిక, మంచి నీటి శుద్ధి (డీశాలినేషన్) మౌలిక సదుపాయాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ప్రతి హెచ్చరిక జారీ చేసింది. ట్రంప్ ఆదివారం ఉదయం 5 గంటలకు తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందించారు. ఆ క్షణం నుంచి సరిగ్గా 48 గంటల గడువు విధిస్తూ ఇరాన్‌‌‌‌‌‌‌‌కు సందేశం పంపారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం వరకు ఈ గడువు ఉంటుంది. "ఎలాంటి బెదిరింపులు లేకుండా 48 గంటల లోపు హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరవాలి. లేదంటే అమెరికా ఆ దేశంలోని పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తుంది. అన్నిటికంటే పెద్ద పవర్ ప్లాంట్ నుంచి ఈ ధ్వంసం మొదలవుతుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు. దీనిపై ఇరాన్ సైనిక విభాగం ‘ఖాతమ్ అల్-అన్బియా’ స్పందిస్తూ.. ‘‘శత్రువు మా ఇంధన వనరులపై దాడికి దిగితే, ఈ ప్రాంతంలోని అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలకు చెందిన ఇంధన, సమాచార సాంకేతిక, మౌలిక సదుపాయాలన్నింటినీ ధ్వంసం చేస్తాం’’ అని ఏఎఫ్‌‌‌‌‌‌‌‌పీ వార్తా సంస్థ ద్వారా హెచ్చరించింది. యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ ప్రకటించిన ఒక్క రోజులోనే ఈ స్థాయిలో హెచ్చరికలు రావడం ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. 

పూర్తిగా మూసేస్తం: ఇరాన్

టెహ్రాన్: అమెరికా తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్  కౌంటర్ ఇచ్చింది.  ప్రస్తుతం తమ శత్రువుల (ఇజ్రాయెల్, అమెరికా) కు, తమపై దాడులకు సాయం చేస్తున్న దేశాలకు మాత్రమే జలసంధిని మూసివేశామని, మిగతా దేశాల నౌకలు నిరాటంకంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు గుర్తుచేసింది. అయితే, డొనాల్డ్ ట్రంప్ తాజాగా హార్మూజ్ ను వెంటనే తెరవాలంటూ 48 గంటల గడువు విధించడం, ఆలోగా తెరవకుంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై తీవ్రమైన దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ సైనిక విభాగం ‘ఖాతమ్ అల్-అన్బియా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘‘అమెరికా గనుక మా విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే, హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తాం. ధ్వంసమైన మా ప్లాంట్లు పునర్నిర్మించే వరకు దానిని తిరిగి తెరవము’’ అని ప్రకటించింది.