- డ్రాగన్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే 100% టారిఫ్లు వేస్తామని వార్నింగ్
- అమెరికా వల్లే కెనడా బతుకుతోంది.. కానీ కృతజ్ఞత చూపడం లేదని కామెంట్
వాషింగ్టన్:కెనడాపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. గ్రీన్ లాండ్ లో తాము నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును తిరస్కరించిన కెనడా.. మరోవైపు చైనాతో వ్యాపార సంబంధాలు పెంచుకోనున్నట్టు ప్రకటించడంపై ఆయన ఫైర్ అయ్యారు.
‘‘గోల్డెన్ డోమ్ తో కెనడాకు కూడా రక్షణ లభిస్తుంది. అయినా, వాళ్లు దానిని తిరస్కరించారు. చైనాతో బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఒక ఏడాదిలోపే వాళ్లను చైనా తినేస్తుంది. కెనడా సామాజిక, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుంది” అంటూ ట్రంప్ ఈ మేరకు శుక్రవారం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టారు.
చైనాతో కెనడా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే అమెరికాలోకి దిగుమతి అయ్యే కెనడియన్ వస్తువులన్నింటిపైనా100 శాతం టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికాలోకి చైనా వస్తువులను డంప్ చేసేందుకు కెనడాను అడ్డాగా మారుస్తామనుకుంటే అది పూర్తిగా పొరపాటేనన్నారు.
ఇటీవల దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం వేదికగా అమెరికా తీరుపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శలు గుప్పించడంపైనా ట్రంప్ స్పందించారు. కెనడాకు తాము ఎన్నో ఉచితాలు ఇచ్చామని, అందుకోసం వారు కృతజ్ఞతతో ఉండాలన్నారు. ‘‘మా నుంచి వాళ్లు ఎన్నో ఉచితాలు అందుకున్నారు. అందుకోసం వాళ్లు కృతజ్ఞతగా ఉండాలి.
కానీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆ కృతజ్ఞత చూపడంలేదు. అమెరికా వల్లే కెనడా బతుకుతోంది. మరోసారి అమెరికాపై కామెంట్లు చేసేటప్పుడు ఈ విషయాన్ని కార్నీ గుర్తుపెట్టుకోవాలి” అని పేర్కొన్నారు.
