
వాషింగ్టన్: లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్–2028ను పర్యవేక్షించడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. భద్రత, వీసా సదుపాయం, ఇంటర్ ఏజెన్సీ సమన్వయంపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ మంగళవారం సంతకం చేయనున్నట్లు వైట్ హౌస్ పరిపాలన అధికారి వెల్లడించారు. ట్రంప్ క్యాబినెట్, గవర్నమెంట్ సంస్థల సభ్యులతో కూడిన ఈ టాస్క్ ఫోర్స్.. రవాణ సదుపాయాలపై ఫెడరల్, స్టేట్స్, స్థానిక ప్రభుత్వాలతో మాట్లాడుతుంది. విదేశీ అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు, మీడియాకు సంబంధించిన వీసా ప్రాసెసింగ్‌ను పర్యవేక్షించనుంది. మరో మూడేళ్లలో ఈ ఒలింపిక్స్ జరుగుతుండటంతో ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.
‘ట్రంప్ తన మొదటి పదవీకాలంలో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ బిడ్‌ను పొందడంలో కీలక పాత్ర పోషించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ క్రీడా దృశ్యాన్ని పర్యవేక్షించనున్నారు. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నారు’ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. 1932, 1984లోనూ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన యూఎస్ మూడోసారి విశ్వ క్రీడలను నిర్వహించబోతున్నది. ‘ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మా ప్రణాళిక ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తున్నది. 2028 వేసవిలో ప్రపంచం చూసే అతిపెద్ద వేడుక ఒలింపిక్స్. ఈ గొప్ప క్రీడలను అద్భుతంగా నిర్వహించడంలో మా నిబద్ధతకు నిదర్శనం కానుంది’ అని లాస్ ఏంజిల్స్ చైర్మన్, ప్రెసిడెంట్ కేసీ వాస్సర్‌మాన్ పేర్కొన్నారు.