ఏం మాట్లాడుతున్నవ్.. మేం లేకుండా శాంతి చర్చలేంటి..? ట్రంప్‎పై జెలెన్‎స్కీ ఫైర్

ఏం మాట్లాడుతున్నవ్.. మేం లేకుండా శాంతి చర్చలేంటి..? ట్రంప్‎పై జెలెన్‎స్కీ ఫైర్

వాషింగ్టన్‌‌‌‌: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌‌‌‌తో ఈ నెల 15న భేటీ కానున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యూఎస్‌‌‌‌లోని అలస్కాలో జరిగే ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్‌‌‌‌ మధ్య శాంతి ఒప్పందంపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో ట్రంప్‌‌‌‌ ప్రకటించారు. అంతకుముందు ఆయన వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉక్రెయిన్‌‌‌‌ ప్రెసిడెంట్ జెలెన్‌‌‌‌స్కీ శాంతిని కోరుకుంటున్నారు. 

శాంతి ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య భూభాగాల మార్పిడి ఉండొచ్చు. ఏదీ అంత సులభం కాదు.. కొన్ని భూభాగాలను వెనక్కి తీసుకుని, మరికొన్ని భూభాగాలను మార్చుకోవాల్సి ఉంటుంది. రెండు దేశాలకు మేలు జరిగేలా ఈ ఒప్పందం ఉంటుంది” అని ట్రంప్ తెలిపారు. పీస్‌‌‌‌ డీల్‌‌‌‌కు ఇక ఇదే చివరి అవకాశమా..? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అలాంటి పదాలు ఉపయోగించడం నాకు ఇష్టం ఉండదు. తుపాకులు పేలడం ప్రారంభిస్తే, వాటిని ఆపడం చాలా కష్టం” అని పేర్కొన్నారు.  

ట్రంప్ కామెంట్లపై జెలెన్‌‌‌‌ స్కీ ఫైర్.. 

శాంతి ఒప్పందంలో భాగంగా భూభాగాల మార్పిడి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన కామెంట్లపై ఉక్రెయిన్‌‌‌‌ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌స్కీ మండిపడ్డారు. తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘మా దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యలను ఆమోదించం. మేం లేకుండా శాంతి చర్చలు ఎలా జరుపుతారు..? ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేం. ఉక్రెయిన్‌‌‌‌ లేకుండా జరిపే చర్చల్లో ఏ పరిష్కారాలు నిర్ణయించినా.. వాటితో ఫలితం ఉండదు” అని ఫైర్ అయ్యారు.

ట్రంప్, పుతిన్ భేటీని స్వాగతిస్తున్నం: కేంద్రం

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఈ నెల 15న అలాస్కాలో భేటీ కానుండటాన్ని స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ‘‘ఉక్రెయిన్ అంశంపై చర్చలకు ముందుకు వచ్చిన అమెరికా, రష్యాకు మద్దతు తెలుపుతున్నాం. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు, శాంతి స్థాపనకు ఈ మీటింగ్ దోహదం చేస్తుందని ఆకాంక్షిస్తున్నాం. ఇది యుద్ధాల యుగం కాదు అని ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే పలుసార్లు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం” అని విదేశాంగ శాఖ పేర్కొంది.