న్యూయార్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్మరోసారి అధికార పీఠంపై కన్నేశారు. రెండోసారీ ప్రెసిడెంట్ పదవిని కైవసం చేసుకునేందుకు తన అమ్ములపొదిలోని ‘జాతి విద్వేష’ అస్త్రానికి మెల్లగా పదును పెడుతున్నారు. ‘‘అమెరికాకు వలస వచ్చిన వారిపై సీరియస్ కామెంట్స్ చేయడం, తద్వారా దేశంలోని తెల్లజాతి ప్రజల్లో దేశభక్తి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం..” 2017లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచినప్పుడు ట్రంప్ అనుసరించిన ప్రధాన వ్యూహమిది. ఇప్పుడు 2020 నవంబరులో రానున్న అధ్యక్ష ఎన్నికలకు కూడా ట్రంప్ ఇదే వ్యూహాన్ని ప్రయోగిస్తున్నారు.
ఈమధ్యనే ఆయన నలుగురు డెమొక్రాట్ మహిళా సెనెటర్లు.. అలెగ్జాండ్రియా ఒకాసియో–కార్టెజ్, ఇల్హాన్ ఒమర్, అయానా ప్రిస్లీ, రషీదా తాలిబ్లు వారి దేశాలకు వెళ్లిపోవాలంటూ ట్రంప్ చేసిన జాతి విద్వేష వ్యాఖ్యలు, ట్వీట్లు ఈ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నార్త్ కరోలినాలో ఓ ర్యాలీ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేయగా.. ర్యాలీకి వచ్చిన జనంలోంచి చాలామంది కూడా ‘వెనక్కి పంపండి’ అంటూ వంతపాడారు. వలసవాదులు, మైనారిటీలను బూచీలుగా చూపడం, దేశంలోని తెల్లజాతి ప్రజల్లో అసంతృప్తులతో సహా మెజారిటీ జనాన్ని తన వైపు తిప్పుకోవడంలో ఈసారి కూడా విజయం సాధిస్తానని ట్రంప్ధీమాగా ఉన్నారు. అందుకే.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, మీడియా, అంతర్జాతీయ సమాజం తప్పుపట్టినా సరే.. ట్రంప్ ఇదే అస్త్రాన్ని మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. ‘
‘ట్రంప్ అమెరికా జెండా కోసం నిలబడతారు. సరిహద్దులను బార్లా తెరవడానికి వ్యతిరేకం. దేశభక్తి ఎల్లప్పుడూ గెలుస్తుంది’’ అని ఆయన అధికార ప్రతినిధి కెల్లీ సాడ్లర్ వ్యాఖ్యానించడం దీనిని తేటతెల్లం చేస్తోంది. ట్రంప్ వ్యూహం దురదృష్టకరం అయినప్పటికీ, ఆయన స్మార్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని, క్రమంగా ఎన్నికల వేడి రాజుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
