బిడ్డ పుడితే వెయ్యి డాలర్లు: కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్న ట్రంప్

బిడ్డ పుడితే వెయ్యి డాలర్లు: కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్న ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో జన్మించిన చిన్నారుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ మేరకు 2025 నుంచి 2029 మధ్య అమెరికన్ పౌరులకు జన్మించే ప్రతి చిన్నారి పేరిట1,000 డాలర్ల సొమ్ముతో ఓ ఇన్వెస్ట్ మెంట్ ఖాతాను ప్రభుత్వం ఉచితంగా తెరుస్తుంది. వీటిని ‘ట్రంప్ ఖాతా’లుగా పిలవనున్నారు. 2024 జనవరి 31 తర్వాత నుంచి 2029 డిసెంబర్ 31 మధ్య జన్మించే చిన్నారులకు ఫెడరల్ ప్రభుత్వం ఏకమొత్తంగా ట్యాక్స్ డెఫర్డ్ ఖాతాలో జమ చేస్తారని ట్రంప్ చెప్పారు. 

ఈ అకౌంట్లను పిల్లల పేరెంట్స్ నియంత్రిస్తారని తెలిపారు. వారు ఈ ఖాతాలో ప్రైవేటు కంట్రిబ్యూషన్ కింద ఏటా 5,000 డాలర్ల వరకు జమ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అకౌంట్లు భావితరాల దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. పిల్లలకు 18 ఏండ్లు వచ్చే వరకు వడ్డీని అందులో జమ చేస్తారు.