
గత కొన్ని రోజులుగా అమెరికాలోని లాస్ఏంజెల్స్ నగరం అట్టుడుకుతోంది. అక్రమంగా అమెరికాలోకి వచ్చి నివసిస్తున్న వారిని ఏరివేతకు ట్రంప్ సర్కార్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. ప్రస్తుతం నిరసనలను అడ్డుకునేందుకు నేషనల్ గార్డ్స్, యూఎస్ మెరైన్స్ రంగంలోకి దిగారు. ఇది ప్రస్తుతం పెద్ద వివాదానికి దారితీసింది.
అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఏకపక్షంగా చర్యలు చేపట్టడం, స్థానిక మేయర్, గవర్నర్ అనుమతులు తీసుకోకపోవటంపై న్యాయనిపుణులు, మాజీ మిలిటరీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైనిక ప్రమేయంతో నిరసనకారులపై బలప్రయోగం ప్రజాస్వామ్య నిబంధనల ఉల్లంఘనగా వారు చెబుతున్నారు. అయితే ఈ నిరసనకారులపై ట్రంప్ వాషింగ్టన్ లో మాట్లాడుతూ.. వారు తిరుగుబాటుదారులని, వృత్తిపరమైన ఆందోళనకారుంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరసనకారులపై యూఎస్ మెరైన్లను ఉపయోగిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఖండించారు. సొంత గడ్డపై అమెరికన్ల మీదకే వీరిని ఉపయోగించటం ద్వారా ట్రంప్ తన నియంత్రిత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. దీనికి ముందు ఈనెల 7న అధ్యక్షుడు ట్రంప్ నిరసనకారులపై ఉక్కుపాదం మోపేందుకు లాస్ఏంజెల్స్ ప్రాంతంలో 2వేల మంది నేషనల్ గార్డ్స్ మోహరింపుకు ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడితో ఆగని ట్రంప్ ఆ తర్వాత 700 మంది యూఎస్ మెరైన్లను కూడా ఇందులోకి దింపారు. అమెరికా చరిత్రలో అంతర్గత నిరసనలను అడ్డుకోవటానికి మిలిటరీని ఉపయోగించటం సంచలనంగా మారింది.
►ALSO READ | US News: హార్వర్డ్ స్టూడెంట్ వీసా రీస్టార్ట్.. కోర్టు తీర్పుతో ఎంబసీలకు ఆదేశాలు..
ఎప్పుడైనా నేషనల్ గార్డ్స్ ని ఉపయోగించాలి అనుకుంటే అందుకోసం ముందుగా స్థానిక గవర్నర్, మేయర్ వంటి అధికారులకు దానిపై పూర్తి అధికారం ఉంటుంది. కానీ ట్రంప్ ప్రస్తుతం చేస్తున్న చర్యలతో దానిని అతిక్రమిస్తున్నారనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ టైటిల్ 10 కింద తనకు ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి నేషనల్ గార్డ్స్ ని రంగంలోకి దింపారు. ఇది స్థానిక ప్రభుత్వాల అధికారాలను చేతిలోకి తీసుకుని వాషింగ్టన్ కేంద్రంగా పవర్స్ సెంట్రలైజ్ చేయటమేనని వారు అంటున్నారు.
వాస్తవానికి అమెరికాలోని ఏదైనా అశాంతి ఉన్నప్పుడు వాటిని అదుపుచేసేందుకు ఫెడరల్ ట్రూప్స్ రంగంలోకి దిగటం చాలా అరుదుగా జరుగుతుందని అమెరికా చరిత్ర చెబుతోంది. చివరిగా 1992 లాస్ఏంజెల్స్ అల్లర్ల సమయంలో దళాలను భారీగా మోహరించటం జరిగింది. అయితే అప్పట్లో అది రాష్ట్ర గవర్నర్ అభ్యర్థన, సమన్వయంతో జరిగింది. కానీ ప్రస్తుతం ట్రంప్ ఏకపక్ష చర్య అమెరికా చరిత్రలో చీకటి క్షణాలను గుర్తుకు తెస్తుందని విమర్శకులు అంటున్నారు. అలాగే లాస్ ఏంజిల్స్‌లో ట్రంప్ సైనిక మోహరింపు రాజ్యాంగ పరిమితులు, సమాఖ్యవాదం, పౌర సమాజంలో సైన్యం పాత్ర గురించి ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతోంది.