
Harvard student visa: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిలువరిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై హార్వర్డ్ న్యాయపోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై గతవారం ఫెడరల్ జడ్జ్ మధ్యంతర ఉత్తర్వులు అందించటంతో తిరిగి వీసాల ప్రాసెసింగ్ కి మార్గం సుగమం అయ్యింది.
దీనికి అనుగుణంగా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాన్సులేట్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరాలనుకునే విద్యార్థుల వీసాల ప్రాసెసింగ్ ప్రక్రియ తిరిగి ప్రారంభం అయ్యింది. అలాగే యూనివర్సిటీకి వచ్చే ఎక్స్చేంజ్ విజిటర్ వీసాల ప్రాసెసింగ్ కూడా తిరిగి స్టార్ట్ చేయబడింది.
ప్రస్తుతం హార్వర్డ్ విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఆర్డర్ పై న్యాయపరమైన విచారణ కొనసాగుతూనే ఉంది. హార్వర్డ్ తన వ్యాజ్యంలో ట్రంప్ పరిపాలన కావాలనే ప్రతీకార చర్యలకు దిగిందని కోర్టుకు వెల్లడించింది. తమ విశ్వవిద్యాలయంలో పరిపాలన, కరిక్కులం, సైద్ధాంతిక వైఖరిని నియంత్రించే ప్రయత్నం చేస్తోందని, దానికి అంగీకరించనుందుకు తమ కళాశాలను శిక్షిస్తోందని హార్వర్డ్ ఆరోపించింది.
ఇదే క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ వీసా నిషేధానికి జాతీయ భద్రతా సమస్యలను కారణంగా చూపారు. విదేశీ విద్యార్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం, నిరసనల్లో పాల్గొనడం, రీసెర్చ్ పై గూఢచర్యం చేయడం ద్వారా ముప్పును కలిగిస్తున్నారని ఆరోపించారు. గూఢచర్యం మరియు తప్పుడు సమాచారంపై FBI హెచ్చరికలను ప్రస్తావించారు. కానీ చివరికి కోర్టు హార్వర్డ్ విదేశీ విద్యార్థులను చేర్చుకునేందుకు తాత్కాలికంగా అంగీకరిస్తూ ఆర్డర్ జారీ చేసింది.