మే 14 లోపు యుద్ధం ముగించాలని చూస్తున్న ట్రంప్.. కారణం ఇదే..!

మే 14 లోపు యుద్ధం ముగించాలని చూస్తున్న ట్రంప్.. కారణం ఇదే..!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో మరోసారి కీలక పోస్ట్ చేశారు. డీల్ కోసం ఇరాన్ బతిమాలుకుందని, కానీ.. ఇరాన్ బాహాటంగా అలాంటిదేమీ లేదని అబద్ధాలు చెబుతుందని ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్ ఆర్మీ దాదాపుగా నాశనమైందని.. తిరిగి కోలుకునే అవకాశం ఇరాన్కు జీరో అని  ట్రంప్ చెప్పారు. డీల్ కోసం అమెరికాతో చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు విచిత్రంగా వ్యవహరిస్తున్నారని.. మరీ ఆలస్యం కాకముందే ఇరాన్ త్వరపడటం ఆ దేశానికి మంచిదని ట్రంప్ హెచ్చరించారు.

డీల్ కోసం అమెరికాను వేడుకుంటూ బయటకు మాత్రం.. అమెరికా ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఇరాన్ ప్రతినిధులు చెప్పడం తప్పు అని ట్రంప్ చెప్పారు. మరీ ఆలస్యం జరిగితే ఇరాన్ కు భారీ నష్టం తప్పదని.. ఒక్కసారి పరిస్థితి చేయి దాటి పోతే.. ఇక వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే ఉండదని.. ఆ తర్వాత పరిస్థితులు ఏమాత్రం కంట్రోల్లో ఉండవని ఇరాన్ను ట్రంప్ హెచ్చరించారు. నాలుగు వారాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా వెన్నుదన్నుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

ఇరాన్ డీల్ కోసం ప్రయత్నిస్తుందని ట్రంప్ చెబుతుంటే.. ఇరాన్ మాత్రం చర్చలు జరిపే ఉద్దేశమే తమకు లేదని తేల్చి చెబుతుండటం గమనార్హం. ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బుధవారం వాషింగ్టన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ నాయకులు తమతో చర్చలు జరుపుతున్నారని, వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. అయితే.. ఆ ఒప్పందం గురించి బయటకు చెబితే తమ దేశ ప్రజల చేతుల్లో చావు తప్పదనే భయంతో ఆ విషయాన్ని చెప్పడానికి భయపడుతున్నారని అన్నారు.

►ALSO READ | కువైట్ ఎయిర్ పోర్ట్పై ఇరాన్ బాంబులు.. ఫ్యుయల్ ట్యాంకులు ఎలా పేలాయో చూడండి..!

ఇదిలా ఉండగా.. మే 14, 15 నాటికి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ భావిస్తున్నట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రిపోర్ట్ చేసింది. ఇరాన్‌తో యుద్ధం కారణంగా చైనా అధ్యక్షుడితో ట్రంప్ భేటీ వాయిదా పడింది. మే 14 లేదా మే 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్కు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే.. ఈలోపే ఇరాన్తో యుద్ధం ముగించాలని ట్రంప్ భావిస్తున్నారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ చెప్పుకొచ్చింది. 

పైగా.. అమెరికా దగ్గర అంతకు మించి యుద్ధానికి సరిపడా ఆయుధాలు లేవని.. ఆయుధాల కొరతను అమెరికా ఎదుర్కొంటుందని.. అందుకే పరిమిత పరిస్థితుల్లో వైమానిక దళాలు ఉపయోగించే "డంబ్ బాంబుల"ను అమెరికా వాడాల్సి వస్తుందని ‘ది టెలిగ్రాఫ్’ రిపోర్ట్ చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి.. యుద్ధం మొదలైన 16 రోజుల్లోనే అమెరికా, అమెరికా మిత్ర దేశాలు 26 బిలియన్ డాలర్ల వ్యయంతో 11 వేల ఆయుధాలను ఇరాన్పై దాడులకు ఉపయోగించాయి.