మదురో.. గద్దె దిగుతవా.. దింపేయాల్నా! వెనెజువెలా అధ్యక్షుడికి ట్రంప్ అల్టిమేటం?

మదురో.. గద్దె దిగుతవా.. దింపేయాల్నా! వెనెజువెలా అధ్యక్షుడికి ట్రంప్ అల్టిమేటం?
  • వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక సంచలన కథనం 
  • ఆ దేశ గగనతలం క్లోజ్ అయిందంటూ తాజాగా ట్రంప్ ప్రకటన 
  • సైనిక చర్యకు సిద్ధమవుతున్నారంటూ ఊహాగానాలు 
  • ట్రంప్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన మదురో సర్కార్ 

వాషింగ్టన్/కారకస్: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో తనంతట తానుగా గద్దె దిగిపోవాలని, లేకపోతే సైనిక చర్యతో గద్దె దింపాల్సి ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీచేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం వెలువరించింది. మదురోతో ఇటీవల హాట్​లైన్​లో మాట్లాడిన ట్రంప్.. ఈమేరకు హెచ్చరికలు జారీ చేశారని ఆ పత్రిక పేర్కొంది. ‘‘ఈజీగానా? లేదంటే కష్టంగానా? ఎలా గద్దె దిగుతావో తేల్చుకో”అంటూ వార్నింగ్ ఇచ్చారని తెలిపింది. అయితే, వెనెజువెలా దేశ గగనతలం పూర్తిగా క్లోజ్ అయిందని ట్రంప్ శనివారం బాంబు పేల్చారు. 

ఆ దేశం చుట్టూ ఉన్న ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ అయినట్టే భావించాలని తన ట్రూత్ సోషల్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘ఎయిర్ లైన్స్, పైలట్లు, డ్రగ్ డీలర్లు, హ్యూమన్ ట్రాఫికర్లకు గగనతలం బంద్ అయింది” అని పేర్కొన్నారు. కాగా, వెనెజువెలా అధ్యక్షుడు మదురో అమెరికాలోకి డ్రగ్స్ సరఫరాకు సహకరిస్తూ, నార్కోటెర్రరిజానికి పాల్పడుతున్నారని.. ఆయన గద్దె దిగాలని ట్రంప్ తరచూ హెచ్చరిస్తున్నారు. అలాగే వెనెజువెలా వైపు సముద్రంలో అమెరికా భారీగా యుద్ధనౌకలను, బలగాలను కూడా మోహరించింది. 

దీంతోపాటు తాజాగా ట్రంప్ స్వయంగా వెనెజువెలా గగనతలం క్లోజ్ అయిందంటూ ట్రంప్ స్వయంగా ప్రకటన చేయడంతో ఆయన సైనిక చర్యకు సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఈ విషయంపై వైట్ హౌస్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కాగా, ట్రంప్ పోస్ట్ పై వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో సర్కారు మండిపడింది. ‘‘ఇది వలసవాద బెదిరింపు. ఆటవికం. మా దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించడమే” అంటూ తీవ్రంగా ఖండించింది.