- అమెరికాపై ట్రేడ్ బజూకా ప్రయోగించే యోచనలో యురోపియన్ యూనియన్
- ఎనిమిది సభ్య దేశాలపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన కూటమి
- అమెరికా టారిఫ్‌లకు కౌంటర్ చర్యలు తప్పవని వెల్లడి
- ట్రంప్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడి వార్నింగ్
బ్రసెల్స్ (బ్రెజిల్): గ్రీన్ లాండ్ ద్వీపాన్ని అమెరికాలో కలిపేసుకోవాలన్న ట్రంప్ పంతం కొత్త మలుపు తీసుకుంది. ఈ విషయంలో అమెరికాను వ్యతిరేకించే దేశాలపై టారిఫ్ లు విధిస్తానని హెచ్చరించిన ట్రంప్.. అన్నట్లుగానే ఈయూలోని డెన్మార్క్ సహా 8 దేశాలపై 10% సుంకాలు విధించి ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు.
గ్రీన్లాండ్ కొనుగోలుకు ఈ నెలాఖరులోగా ‘డీల్’ కుదరకుంటే ఈ సుంకాలను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు. దీంతో యురోపియన్ యూనియన్ చీఫ్‌లతో పాటు సభ్య దేశాల ప్రతినిధులు ట్రంప్‌పై మండిపడ్డారు. దీనిపై ఆదివారం బ్రెజిల్‌లోని బ్రసెల్స్ లో సభ్య దేశాల ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ట్రంప్ టారిఫ్‌ల విషయంలో మౌనంగా ఉండబోమని స్పష్టం చేశారు. ట్రంప్ వైఖరికి నిరసనగా తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన ఈయూ.. అమెరికాపై యాంటీ కోయెర్సియన్ ఇన్స్రుమెంట్(ఏసీఐ) ట్రేడ్ బజూకా అస్త్రాన్ని ప్రయోగించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మీడియాకు వెల్లడించారు. అమెరికాపై బజూకాను ప్రయోగించాలంటూ ఫ్రాన్స్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కాగా, గ్రీన్లాండ్ విషయంలో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలపై శనివారం 10 శాతం సుంకాలను విధించారు.
ఏంటీ ట్రేడ్ బజూకా..
యురోపియన్ యూనియన్ దేశాలపై ఆర్థికంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలను వమ్ము చేయడానికి సిద్ధం చేసిన అస్త్రమే ట్రేడ్ బజూకా.. ఆర్థిక ప్రయోజనాల విషయంలో ట్రేడ్ బజూకా అత్యంత పదునైన ఆయుధంగా నిపుణులు చెబుతున్నారు. ఈయూ ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు దీనిని ఉపయోగించలేదని సమాచారం. ఈ ట్రేడ్ బజూకా సాయంతో కూటమేతర దేశాలపై ప్రతీకార సుంకాలు విధించే అవకాశం ఈయూకు లభిస్తుంది. అమెరికాపై ఈ బజూకా ప్రయోగిస్తే.. ఈయూలోని దేశాలకు సంబంధించిన లాభదాయక టెండర్లలో అమెరికన్ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉండదు. సభ్య దేశాలకు అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తు సేవలపై పన్ను విపరీతంగా పెంచే సౌలభ్యం కలుగుతుంది. అంటే.. ఈయూ దేశాల మార్కెట్‌ను అమెరికా కంపెనీలు వదులుకోవాల్సి వస్తుంది. ఆమేరకు ఈయూ ఆంక్షలు విధిస్తుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్(ఎఫ్‌డీఐ) లపైనా ఆంక్షలు పెట్టి, వాటి పరిమితిని కుదించే అవకాశం ఉంది. ప్రధానంగా దీనిని ఈయూ కూటమికి వ్యతిరేకమైన చైనా, రష్యాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. అనూహ్యంగా మిత్రదేశంపైనే ప్రయోగించాల్సి వచ్చేటట్లుందని మాక్రాన్ చెప్పారు. అయితే, గ్రీన్ లాండ్ విషయంలో ఏర్పడిన వివాదాన్ని ట్రంప్‌తో చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఈయూ భావిస్తున్నట్లు సమాచారం.
