- భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరిక
- యూఎస్‌లో రైస్ డంప్ చేస్తున్నారని ఫైర్
- అమెరికా రైతులకు లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబ్ పేల్చారు. మన దేశం నుంచి యూఎస్‌కు ఎగుమతి అవుతున్న బియ్యంపై అదనపు పన్నులు
విధించినున్నట్టు హెచ్చరించారు. భారత్ సహా మరికొన్ని దేశాలు అమెరికాలో బియ్యం డంప్ చేస్తున్నాయని, టారీఫ్‌లు విధిస్తే నిమిషాల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందని వ్యాఖ్యానించారు. అమెరికా రైతులకు 12 బిలియన్ డాలర్ల (రూ.లక్షా 7 వేల కోట్లు) ఆర్థిక సాయం ప్రకటించిన ట్రంప్.. సోమవారం వైట్‌హౌస్‌లో వ్యవసాయ రంగ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్లు తమ సమస్యలను అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.
ఓ రైస్ మిల్లు ఓనర్ మెరిల్ కెన్నెడీ మాట్లాడుతూ.. ఇతర దేశాలు అమెరికాలో రైస్‌ను డంప్ చేస్తుండడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ‘‘ముఖ్యంగా ఇండియా, థాయ్‌లాండ్, చైనా పెద్ద ఎత్తున బియ్యాన్ని ఇక్కడ డంప్ చేస్తున్నాయి. మీరు (ట్రంప్) ఇప్పటికే విధించిన టారిఫ్‌లతో కొంతమేర ఫలితం కనిపిస్తోంది.. కానీ ఆ టారిఫ్‌లను డబుల్ చేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘‘మన దేశంలో బియ్యం డంప్ చేసేలా భారత్‌ను ఎందుకు అనుమతిస్తున్నారు? బియ్యం విషయంలో వాళ్లకేమైనా మినహాయింపులు ఉన్నాయా?” అని ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్‌ను ప్రశ్నించారు. అయితే అలాంటి మినహాయింపులేమీ లేవని ఆయన సమాధానమిచ్చారు. అట్లయితే భారత్ పన్నులు చెల్లించాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘ఇదేం పెద్ద సమస్య కాదు.. టారిఫ్‌లు విధిస్తే ఒక్క రోజులోనే పరిష్కారమైపోతుంది. కార్, చిప్ ఇండస్ట్రీపైనా టారిఫ్‌లు విధిస్తే.. సమస్య రెండు నిమిషాల్లో పరిష్కారమవుతుంది” అని ట్రంప్ పేర్కొన్నారు.
