
వాషింగ్టన్: రష్యా నుంచి క్రూడాయిల్ కొంటూ ఇండియా భారీగా లాభపడుతోందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నరావో మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. సుంకాల్లో ఇండియాను ‘మహారాజ’ అని పేర్కొన్నాడు. రష్యా సహకారంతో ఇండియా ఇలా ‘లాభదాయక స్కీమ్’ను నడిపిస్తున్నదని ఎద్దేవా చేశాడు.
రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌తో యుద్ధానికి నిధులు సమకూర్చుకోవడంలో పుతిన్‌కు సహాయపడుతున్నదని ఆరోపించారు. వైట్‌హౌస్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభానికి ముందు 2022 ఫిబ్రవరిలో రష్యా నుంచి ఇండియా ఒక శాతం క్రూడాయిల్ మాత్రమే కొనేది.
కానీ.. ఇప్పుడు 40% చమురు కోసం రష్యాపై ఆధారపడుతున్నది. మోదీ గొప్ప నాయకుడు. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో ఇండియా పాత్ర కీలకం. అయితే, ప్రస్తుతం ఇండియా చేస్తున్న పనులు శాంతికి దోహదం చేయడంలేదు. యుద్ధాన్ని శాశ్వతం చేసేలా ఉన్నాయి’’ అని పీటర్ విమర్శించాడు. దీనిపై మన విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘రష్యా నుంచి క్రూడాయిల్ కొనాలని ఒకప్పుడు అమెరికానే ఇండియాకు సూచించింది. ఇప్పుడేమో బెదిరిస్తున్నది’’ అని జైశంకర్ అన్నారు.