- ఒక్కో నాయకుడు వంద కుటుంబాలను కలిసేలా ప్రణాళిక
- ప్రత్యేకంగా ముద్రించిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి అంటించనున్న లీడర్లు
- చరిత్ర సృష్టించాలంటూ పార్టీ క్యాడర్‌కు బండి సంజయ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ శ్రీకారం చుట్టింది. మహా జన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈనెల 22న ‘ఇంటింటికీ బీజేపీ’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలవనున్నారు. పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి దాకా ప్రతి ఒక్కరూ ఆ రోజు తమ నియోజకవర్గాల్లోని ప్రజలను కలవనున్నారు. రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలు ఉండగా.. ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు తమ పోలింగ్ కేంద్రం పరిధిలో కనీసం వంద కుటుంబాలను కలవనున్నారు.
మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు వివిధ స్కీమ్‌ల కింద ప్రజలు పొందుతున్న లబ్ధిపై కరపత్రాలు పంచనున్నారు. ప్రత్యేకంగా ముద్రించిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి అంటించనున్నా రు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా.. తమ నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవనున్నారు. కరీంనగర్‌లోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో సంజయ్ పర్యటించనున్నారు. ఈ కాలనీల్లో సంజయ్ ఇంటిం టికీ వెళ్లి మోడీ ప్రభుత్వ విజయాలు, ప్రజలకు జరిగిన మేలును వివరించి కరపత్రాలను అందజేయనున్నారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలంతా తమ సెగ్మెంట్లలో పర్యటించనున్నారు.
కార్యాచరణ రూపొందించుకోండి: సంజయ్
‘‘ఈనెల 22న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టాలి. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త మొదలు రాష్ట్ర, జాతీయ నాయకుడి వరకు అందరూ తమ పోలింగ్ బూత్ పరిధిలో సగటున వంద ఇండ్లకు వెళ్లి ప్రజలకు మోదీ పాలన గురించి వివరించాలి. రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించి, చరిత్ర సృష్టించాలి” అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం శక్తి కేంద్రాల వారీగా సమావేశం నిర్వహించి ఎవరెవరు ఏ గల్లీలో తిరిగి ప్రజలను కలవాలనే అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఏ ఇంటికి వెళ్లినా.. నరేంద్ర మోదీ పాలనా విజయాలు, ప్రజలకు చేసిన మేలుపై ప్రచురించిన కరపత్రాలను పంచడంతోపాటు 9090902024 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇచ్చేలా చూడాలని కోరారు.
యోగా డేని ఘనంగా నిర్వహించాలి
ఈనెల 21న రాష్ట్రవ్యాప్తంగా ‘యోగా డే’ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పోలింగ్ బూత్‌ను శక్తివంతం చేయడమే లక్ష్యంగా ‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’ పేరిట ఈనెల 27 నుంచి జులై 5 వరకు కార్యక్రమాలను రూపొందించినట్లు ఆయన వివరించారు. 27న కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 10 మంది చొప్పున తెలంగాణ నుంచి 170 మందిని ఎంపిక చేశామని తెలిపారు. వీరంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోలింగ్.. బూత్ కమిటీల బలోపేతంపై దృష్టి పెడుతారని చెప్పారు. మన రాష్ట్రానికి కూడా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది కార్యకర్తలు ఈనెల 27న వస్తున్నారని, వీరంతా 7 రోజులపాటు ప్రతి శక్తి కేంద్రంలో పర్యటించనున్నారని చెప్పారు..
