
- 143 సైబర్ నేరాల్లో 19 మంది అరెస్ట్
- సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ డ్రైవ్
- 14 టీమ్స్‌తో 9 రాష్ట్రాల్లో సోదాలు
- వివరాలు వెల్లడించిన డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలు నియంత్రించేందుకు ఏర్పాటైన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నదని సంస్థ డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలో స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినట్లు వివరించారు. 14 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేసి 9 రాష్ట్రాల్లో సోదాలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన 143 కేసుల్లో 19 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసుల వివరాలను టీఎస్‌సీఎస్‌బీ డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర గురువారం వెల్లడించారు.
ఇటీవలి కాలంలో బిజినెస్, ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి నేరాలు అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిరంతరం పనిచేస్తున్నదని తెలిపారు. సైబర్ క్రైమ్ డేటాతో నేరస్తులను గుర్తిస్తున్నామన్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు చెందిన కమిషనరేట్‌ల నుంచి 14 ఇన్వెస్టిగేటింగ్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటి ద్వారా మెగా డ్రైవ్ నిర్వహించామన్నారు. రాష్ట్రంలో నమోదైన 143 కేసులకు సంబంధించి 9 రాష్ట్రాల్లో సోదాలు చేసినట్లు వివరించారు. గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, వెస్ట్‌బెంగాల్, మహారాష్ట్ర, కేరళ, యూపీలో తనిఖీలు చేశారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 19 మందిని అరెస్ట్ చేసి 26 సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్, 45 డెబిట్ కార్డులు, 9 బ్యాంక్ పాస్‌బుక్స్, పీవోఎస్ మెషిన్, 11 చెక్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.