విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయండి : భట్టి విక్రమార్క

విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయండి :  భట్టి విక్రమార్క
  • ఒడిశా నైనీ బ్లాక్​లో ఉత్పత్తి ప్రారంభంపై ఫోకస్ పెట్టండి
  • సింగరేణి అధికారులతోడిప్యూటీ సీఎం సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వేసవిలో విద్యుత్ కొరత రాకుండా కావాల్సినంత బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లకు నిరంతరాయంగా బొగ్గు రవాణా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌లో సింగరేణిలోని అన్ని విభాగాలపై భట్టి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి అధికారులు వివరించారు. తర్వాత భట్టి మాట్లాడుతూ అవసరం మేరకు అన్ని థర్మల్​పవర్ కేంద్రాలకు బొగ్గు ఉత్పత్తి చేసి వేసవిలో విద్యుత్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఒడిశాలోని నైనీ బ్లాకులో బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

 రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పారు. తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను కేంద్రం వేలం వేయడాన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సింగరేణికి మేలు జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో సింగరేణిని విస్తరించడానికి కోల్‌‌‌‌ మైనింగ్ తోపాటు ఇతర ఖనిజాల అన్వేషణకు రూపొందించిన ప్రణాళికలపై భట్టి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌, అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ మైన్స్‌‌‌‌, కొత్త ప్రాజెక్టులు, థర్మల్, సోలార్ ప్రాజెక్టులు, మెషీనరీ వాడకం, బొగ్గు మార్కెటింగ్, రవాణా తదితర అంశాలపై ఆయా విభాగాల డైరెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే విధంగా సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, సీఎస్ఆర్ నిధుల కేటాయింపు తదితర అంశాలపైన డిప్యూటీ సీఎం సమీక్షించారు.

కార్మిక సంక్షేమంపై దృష్టి పెట్టాలి

సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులను ఆదేశించారు. ఉత్పత్తిని సాధించడంతో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు సంస్థ అందిస్తున్న అలవెన్స్ లు, వైద్య సదుపాయాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్నారు. కారుణ్య నియామకాల కోసం జరుగుతున్న మెడికల్ బోర్డు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్లు ఎన్.బలరామ్, డి.సత్యనారాయణ రావు, ఎన్.వి.కె.శ్రీనివాస్, జి.వెంకటేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆల్విన్, జనరల్ మేనేజర్ ఎం.సురేశ్ వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.