విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు

విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు

ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసెట్ షెడ్యూల్ లో కూడా మార్పులు చేసింది.

 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… రాష్ట్రంలోని పలు పరీక్షలను రీషెడ్యూల్ చేస్తోంది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఇప్పటికే పాలీసెట్ పరీక్ష వాయిదా పడగా…. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్(TS EAPCET) పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. గత షెడ్యూల్ ప్రకారంతో పోల్చితే… మరింత ముందుగానే పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ ఐసెట్ (TS ICET) షెడ్యూల్ కూడా మారింది.

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. మే 9వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు(TS EAPCET)) ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పరీక్షలు 12వ తేదీతో పూర్తి అవుతాయి. కానీ తెలంగాణలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల తేదీకి, పరీక్షల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో... విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. మే 7వ తేదీ నుంచే పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు తేదీలను రీషెడ్యూల్ చేసింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. ఇక మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ మోడ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఫలితంగా గత షెడ్యూల్ తో పోల్చితే ముందుగానే పరీక్షలు పూర్తి కానున్నాయి.

ఐసెట్ షెడ్యూల్ కూడా మార్పు....

 తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ కూడా మారింది. ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం..... జూన్ 4, 5 తేదీల్లో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్ 4వ తేదీన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. అదే రోజు ఎగ్జామ్ నిర్వహణ ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఉన్నత విద్యామండలి…. కొత్త తేదీలను ప్రకటించింది. జూన్ 5, 6 తేదీల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది