- కొత్త పెన్షన్లు వచ్చే నెలలో నెలాఖరు వరకు ఆసరా కార్డుల పంపిణీ
- అది కూడా మండలానికి 48 మందికే
- ఇంకా మొదలేకాని 57 ఏండ్లు నిండినోళ్ల అప్లికేషన్ల వెరిఫికేషన్
- గత నాలుగేండ్లలో 4.30 లక్షల పింఛన్లు రద్దు చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: కొత్త పింఛన్ దారులు మరో నెల రోజులు ఎదురుచూడక తప్పేలా లేదు. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. సెప్టెంబర్ లోనే ఖాతాల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఊరికి ముగ్గురు, నలుగురు చొప్పున మండలానికి 48 మందిని ఎంపిక చేసి.. వారికి మాత్రమే ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. కార్డులొచ్చినా అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. కార్డుల పంపిణీ ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించినందున ఈ నెలాఖరుదాకా పంపిణీతోనే సరిపెట్టి.. సెప్టెంబర్ చివరలో పింఛన్లు జమ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏడాదైనా మొదలుకాని 57 ఏండ్లునిండినోళ్ల అప్లికేషన్ల వెరిఫికేషన్
2018 సెప్టెంబర్ తర్వాత బైఎలక్షన్స్ జరిగిన హుజురాబాద్, నాగార్జున సాగర్ లో మినహా కొత్తగా సర్కారు ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదు. రాష్ట్రంలో గత నాలుగేండ్లలో 3.30 లక్షల కొత్త పింఛన్ అప్లికేషన్లను అప్రూవ్ చేసినా పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. వీరిలో 57 ఏళ్లు నిండినోళ్లు మినహా 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా, ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. ఎంపీడీఓల లాగిన్ లో అప్రూవల్ అయి ఉన్న 3.30 లక్షల మంది జాబితాను ప్రస్తుతం మరోసారి వెరిఫై చేస్తున్నారు. ఇందులో ఎవరైనా చనిపోయినవాళ్లుంటే జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇవికాకుండా 57 ఏండ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్ల కోసం నిరుడు ఆగస్టు, అక్టోబర్లో రెండుసార్లు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. దాదాపు 10 లక్షల దరఖాస్తులొచ్చాయి. కానీ అప్లికేషన్లు తీసుకుని ఏడాదైనా సర్కారు ఇప్పటిదాకా వాటిని వెరిఫై కూడా చేయలేదు. ఆ అప్లికేషన్లు ఇంకా తమ లాగిన్ లోకి రాలేదని ఎంపీడీఓలు చెప్తున్నారు. అప్లై చేసుకున్నవారిలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరో తేల్చకుండా అందరికీ పింఛన్లు ఇవ్వడం కుదరదని, జాబితా వచ్చాక డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తే తప్పా అర్హులెవరో గుర్తించలేమని మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎంపీడీఓ వెల్లడించారు.
పింఛన్ ప్రతి నెలా లేటే..
రాష్ట్రం వచ్చాక రెండుమూడేళ్లు ప్రతి నెలా ఫస్ట్ వీక్ లో అందిన ఆసరా పింఛను.. ఆ తర్వాత లేట్ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 25వ తేదీ నుంచి తర్వాతి నెలలో ఐదో తేదీ వరకు ఇస్తున్నారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్ వచ్చిందో లేదోనని తెలుసుకునేందుకు 15వ తేదీ నుంచి 25 వరకు రోజూ పోస్టాఫీసు, బ్యాంకుల చుట్టూ తిరిగిపోతున్నారు.
