డీఎస్సీలో 75 శాతం .. తెలుగు మీడియం పోస్టులే

డీఎస్సీలో 75 శాతం .. తెలుగు మీడియం పోస్టులే
  • 5,089 టీచర్ పోస్టుల్లో 3,842 పోస్టులు వారివే 
  • ఇంగ్లిష్ మీడియం పోస్టులు135 మాత్రమే 
  • బైలింగ్వల్ పుస్తకాల నేపథ్యంలో తెలుగు మీడియానికి ప్రయారిటీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరిగే టీచర్ పోస్టుల భర్తీలో తెలుగు మీడియం పోస్టులకే సర్కారు ప్రయారిటీ ఇచ్చింది. రెండేండ్ల కింద అన్ని బడుల్లో ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభించినా, ఈసారి డీఎస్సీలో ఆ మీడియానికి సంబంధించిన పోస్టులు పెద్దగా పెట్టలేదు. డీఎస్సీ 2023లో 75శాతం పోస్టులు తెలుగు మీడియం పోస్టులు ఉన్నాయి. దీంతో ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. అయితే, ఈ డీఎస్సీలో 8 మీడియాల్లోని ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 2,575, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌‌‌‌ఏ) 1,739, లాంగ్వేజ్​ పండిట్ 611, పీఈటీ 164 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,089 పోస్టుల్లో 600కుపైగా బ్యాక్‌‌‌‌లాగ్ పోస్టులే ఉండటం గమనార్హం. రెండేండ్ల కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం క్లాసులు ప్రారంభించగా, అన్ని పుస్తకాలను తెలుగు, ఇంగ్లిష్ మీడియంతో కలిపి బైలింగ్వల్‌‌‌‌లో ప్రింట్ చేస్తున్నారు. పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగులో పాఠాలు ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో ఇంగ్లిష్ మీడియం పోస్టులను కొత్తగా క్రియేట్ చేయనట్టు తెలుస్తోంది. 

బ్యాక్‌‌‌‌లాగ్‌‌‌‌ పోస్టులే 500..

ప్రస్తుతం భర్తీ చేయబోయే పోస్టుల్లో ఇంగ్లిష్ మీడియం పోస్టులు 135 మాత్రమే ఉన్నాయి. తెలుగు మీడియంలో 3,842 పోస్టులు ఉండగా, ఉర్దూ మీడియంలో 671, హిందీ మీడియంలో 377, మరాఠీ మీడియంలో 35, బెంగాలీలో 16, కన్నడలో 12 పోస్టులు ఉండగా, తమిళ మీడియంలో ఒక పోస్టు ఉంది. టీఆర్టీ 2017 సమయంలోనూ 8 భాషల్లో పోస్టులను నింపగా, ఈసారి కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉర్దూ మీడియం పోస్టుల్లో 500 వరకు టీఆర్టీ 2017లో భర్తీకాలేదు. ఈసారి వాటిని బ్యాక్ లాగ్ పోస్టుల కింద పెట్టారు.