రాజీవ్ స్వగృహలో అమ్మకానికి 10 వేల ఫ్లాట్లు

రాజీవ్ స్వగృహలో అమ్మకానికి 10 వేల ఫ్లాట్లు
  • నాగోల్– బండ్లగూడ, జవహర్​నగర్, పోచారం, గాజులరామారంలో ఫ్లాట్లు
  • పూర్తయిన ఇండ్లకు స్క్వేర్ ఫీట్ రూ. 3,400 నుంచి రూ. 3,800 వరకు!
  • సెమీ కంప్లీట్ ఫ్లాట్ల ధరలు ఇంకా ఖరారు కాలే
  • వచ్చే నెలలో వేలం?


హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను అమ్మేందుకు రాష్ట్ర సర్కార్ రంగం సిద్ధం చేసింది. దాదాపు 10 వేల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఆఫీసర్లు తాజాగా రిపోర్ట్ అందించారు. వీటి అమ్మకం ద్వారా రూ.1,600 కోట్ల ఆదాయం సంపాదించాలని భావిస్తున్నారు. స్క్వేర్ ఫీట్ చొప్పున మినిమమ్ రేట్ నిర్ణయించి, విక్రయాలు జరపనున్నట్లు తెలుస్తోంది. నాగోల్– బండ్లగూడ, పోచారం, జవహర్‌‌నగర్, గాజులరామారం ప్రాంతాల్లో కంప్లీట్, సెమీ కంప్లీట్ అయిన ఫ్లాట్లను అమ్మాలని సూత్రపాయ్రంగా నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆఫీసర్లు, ఓ రియాల్టీ కంపెనీతో కలిసి తయారు చేసిన రిపోర్ట్ ప్రకారం స్క్వేర్ ఫీట్ రేట్లను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. వచ్చే నెలలోనే ఫ్లాట్లను వేలం వేయనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 

గతంలోనే అమ్మాలనుకుని..

రాజీవ్‌‌ స్వగృహ కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో బండ్లగూడలో 2008లో అపార్ట్‌‌మెంట్ల నిర్మాణం ప్రారంభించారు. 2012లో నిర్మాణాలు పూర్తయ్యాయి. మొదట్లో చదరపు అడుగు ధర రూ.2,100గా నిర్ణయించారు. తర్వాత పలు కారణాలతో రూ.2,950 దాకా పెంచుతూ వచ్చారు. దీంతో 502 ఫ్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 2,244 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక ఫ్లాట్లను విక్రయించేందుకు 2016 ఆగస్టులో వేలం నిర్వహించారు. నిర్మాణాలు పూరైన ఫ్లాట్లకు చదరపు అడుగు ధర రూ.2,800, నిర్మాణాలు పూర్తి కాని ఫ్లాట్లకు చదరపు అడుగు రూ.2,200గా ధర నిర్ణయించారు. కానీ ఈ- వేలానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఉద్యోగులకు కేటాయించాలనుకున్నా అది కుదరలేదు. జవహర్‌‌నగర్‌‌లో 48 ఎకరాల్లో రూ.1,000 కోట్ల అంచనాతో 6,215 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ అన్ని ఫ్లాట్లు సెమీ కంప్లీట్ దశలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.అయితే అందరికీ అవకాశం కల్పించాలా, లేక రియల్టర్లు మాత్రమే వేలంలో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫ్లాట్లతోపాటు వాటి పరిధిలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి అధికారులు నివేదించారు.

మార్కెట్‌‌లో రేట్లు ఎట్లున్నయ్

నాలుగు ప్రాంతాల్లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు ఉండగా.. నాగోల్– బండ్లగూడలో 2,244  ఫ్లాట్లు, పోచారం 1,500 ఫ్లాట్లు ఉన్నట్లు ఆఫీసర్లు రిపోర్ట్ రెడీ చేశారు. ఈ రెండు చోట్ల దాదాపు నిర్మాణాలు పూర్తి కాగా, ఫినిషింగ్ పనులు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. జవహర్‌‌‌‌నగర్, గాజులరామారంలో 6,215 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ చాలా వరకు పనులు మిగిలిపోయాయి. ఇప్పటిదాకా ఖర్చు చేసిన దాని ప్రకారం వీటి రేట్లను నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏం రేట్లు ఉన్నాయి, ప్రస్తుతం మార్కెట్‌‌లో రేట్లు ఎట్లున్నాయనే దాన్ని బట్టి ధరలు ఖరారు చేయనున్నారు. నిర్మాణాలు పూర్తయిన బండ్లగూడ, పోచారం ఫ్లాట్లకు స్క్వేర్ ఫీట్ కనీసం రూ.3,400 నుంచి రూ.3,800 వరకు ధర నిర్ణయించాలని ప్రపోజల్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. సెమీ కంప్లీట్ ఫ్లాట్ల ధరలు ఇంకా ఖరారు చేయలేదు. సింగిల్‌‌, డబుల్‌‌, ట్రిపుల్, డీలక్స్‌‌ ట్రిపుల్ బెడ్‌‌రూంలు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లలో ఉన్నాయి. వేలం పాటలో రియల్టర్లకే అవకాశం ఇవ్వాలా, లేక అందరూ పాల్గొనేందుకు పర్మిషన్ ఇవ్వాలా అనే దానిపై ఎటూ తేల్చలేదు. ముందుగా రియల్టర్లకే చాన్స్ ఇవ్వాలని అనుకున్నా.. ఉన్నతాధికారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సర్కార్​కు అనుమతి కోసం రిపోర్టులు పంపినట్లు తెలిసింది.