యూనివర్సిటీల్లో పోస్టులు భర్తీ చేసేదెప్పుడు?

V6 Velugu Posted on Aug 06, 2021

లెక్చరర్ల పోస్టుల భర్తీపై నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించినట్లుగా ఉంది టీఆర్ఎస్ సర్కారు తీరు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రంలోనూ నియామక ప్రక్రియ సక్రమంగా జరగక యువత తీవ్ర నిరాశలో కూరుకుపోతోంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల్లో 2,979 లెక్చరర్ల పోస్టులకు 827 మందే పనిచేస్తున్నారు. అంటే 2,152 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇంత భారీగా ఖాళీలు లేవు. 2017లో ప్రభుత్వం అనుమతించిన 1,062 పోస్టుల భర్తీకి కొత్త కొత్త వాదనలతో నాలుగేండ్లుగా కాలయాపన చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ రిక్రూట్​మెంట్​ పాలసీ పేరుతో కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. 

గతంలో జరిగిన నియామకాలన్నీ అక్రమాలే 

యూనివర్సిటీల చట్టం ప్రకారం వర్సిటీల లెక్చరర్లు, ఇతర సిబ్బంది నియామకాలన్నింటి సెలక్షన్ కమిటీకి వైస్​ చాన్స్​లర్లే చైర్మన్‌‌గా ఉంటారు. ఈ నియామకాల్లో పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగానే కాక స్వతంత్ర వైఖరి, స్వేచ్ఛా భావనలు, శాస్త్రీయకోణం, మానవీయత కలిగిన వ్యక్తులను వారి వారి రీసెర్చ్​ ఏరియాలకు అనుగుణంగా నియమించాలి. నియామకాల్లో చట్టం ఇంతటి స్వేచ్ఛను వీసీలకు ఎందుకు ఇచ్చిందంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతిభావంతులను, ఎలాంటి ప్రలోభాలకూ లొంగకుండా నియమిస్తారనే. అయితే 1989 నాటి నుంచి రాష్ట్రం ఏర్పాటయ్యే వరకూ కొద్దిపాటి నియామకాలే జరిగినా అవి కూడా వివాదాస్పదమయ్యాయి. పదేండ్ల కాంగ్రెస్ హయాంలో జరిగిన నియామకాలన్నీ అక్రమాలేనని ప్రభుత్వ కమిటీలు, కోర్టులు తేల్చాయి. దీనికి కారణం ఉన్నత ప్రమాణాలు, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వారిని ప్రభుత్వాలు వీసీలుగా నియమించకపోవడమే.

టీఎస్పీఎస్సీ చేస్తే అవినీతి జరగదా?

కొత్తగా నియామకమైన వీసీలంతా ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశమై నియామకాలు ‘‘మేం చేస్తే అక్రమాలు జరుగుతున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా చేయలేకపోతున్నాం. మీరే (ప్రభుత్వమే) చేయండి’’ అంటూ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం కాళ్ల దగ్గర పెట్టడం దారుణం. ఎలుకలున్నాయని ఇల్లు కాల బెట్టుకుంటామా? అక్రమాలు జరుగుతున్నాయని నియామాకాలను ప్రభుత్వాలకు అప్పజెప్పుదామా? యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టే పనిని టీఎస్పీఎస్సీకి అప్పగిస్తామని కొందరు ప్రభుత్వ పెద్దలు ఆంతరంగిక సమావేశాల్లో మాట్లాడుతున్నారు. కానీ, టీఎస్పీఎస్సీలో జరుగుతున్న అక్రమాలకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు. అక్కడ కూడా ఎగ్జామ్​ పేపర్ తయారుచేసేది, ఇంటర్వ్యూలు నిర్వహించేది ప్రొఫెసర్లేననే విషయం మరువరాదు.  

వర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర

తెలంగాణ వచ్చి టీఆర్ఎస్​ సర్కారు కొలువుతీరిన తర్వాత వీసీలు లేకుండానే ఏండ్ల తరబడి వర్సిటీలు నడిచాయి. ఉస్మానియాను ఆక్స్ ఫర్డ్, కాకతీయను కేంబ్రిడ్జ్ రేంజ్ కు తీసుకొస్తానన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ సంగతే మరిచిపోయారు. వర్సిటీల్లో రెగ్యులర్ నియామకాల మాట దేవుడెరుగు, కాంట్రాక్ట్ నియామకాలనూ కట్ చేశారు. ఇటీవలే వీసీలను నియమించినా వీరిలో ఎంతమంది ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మేధావులు ఉన్నారో అందరికీ తెలుసు. వర్సిటీలను చంపే ముందు పిచ్చి కుక్కలని ముద్రేయాలంటే ఇలాంటి వాళ్లే సరిపోతారని అనుకున్నారేమో. వీసీలను నియమించే పనిని ప్రైవేట్ వర్సిటీలను నడిపించే విద్యా వ్యాపారులకు అప్పగించడమే కుట్రలో భాగం. ప్రభుత్వ వర్సిటీలను మరింత నిర్వీర్యం చేస్తే ఇటీవల అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన ప్రైవేట్ వర్సిటీలకు గిరాకీ పెరుగుతుందనుకున్నారేమో? మహత్మాగాంధీ వర్సిటీలో 32 మందిని అక్రమంగా నియమించారంటూ సర్కారు తేల్చిన అక్రమార్కుడినే ప్రతిష్టాత్మక జేఎన్టీయూకు వీసీని చేశారు. ఇంకొకరు తన వర్సిటీలో బెంచీలు, కుర్చీలు, ఏ వస్తువు కొన్నా 20 శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందేనని హుకుం జారీ జేశారు. ఇలాంటి వాళ్లను చూసి అమరవీరుల ఆత్మలు ఘోషించవా?

వీసీల నియామకాలను రద్దు చేయాలె

సెంట్రలైజ్డ్ పాలసీ కారణంగా న్యాయ వివాదాలు ముసురుకొని లెక్చరర్ల నియామకాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే అనేక మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగానే రిటైర్ అవుతున్నారు. కేంద్రీకృతంగా అవినీతి, దోపిడీ మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎంపికయ్యే అభ్యర్థులకు, ఇక్కడి వనరులకు పొంతనలేక పరిశోధనలు కుంటుపడే ప్రమాదమూ ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వీసీల నియామకాలను రద్దు చేసి ఉన్నత విలువలు కలిగిన వారిని వీసీలుగా నియమిస్తే, పారదర్శకంగా లెచ్చరర్ల నియామకాలు జరగుతాయి. తద్వారా ఉన్నత ఆశయాలు కలిగిన విద్యార్థులను వీరు తీర్చిదిద్దుతారు. మన వర్సిటీల్లో తయారయ్యే విద్యార్థులే మన తెలంగాణ బ్రాండ్ అంబాసడర్లుగా మారతారు. మన వర్సిటీలు అంతర్జాతీయంగా పోటీపడేలా తయారు చేసి మొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారో, మరింత నిర్వీర్యం చేసి చరిత్రహీనుడవుతారో కాలమే నిర్ణయిస్తుంది.

- డా.మాసాడి బాపురావు,

జాతీయ కార్యవర్గ ప్రత్యేక  ఆహ్వానితుడుఏబీవీపీ

Tagged government, Telangana, universities, Lecturer posts, replac

Latest Videos

Subscribe Now

More News