బీసీ లోన్లను నాలుగేండ్లుగా పట్టించుకోలే..ఎన్నికల వేళ గ్రీన్​ సిగ్నల్​

బీసీ లోన్లను నాలుగేండ్లుగా పట్టించుకోలే..ఎన్నికల వేళ గ్రీన్​ సిగ్నల్​
  • ఎట్టకేలకు యాక్షన్ ప్లాన్​కు సర్కార్​ గ్రీన్​ సిగ్నల్​
  • నాలుగేండ్లుగా పట్టించుకోలే
  • పోయిన ఎలక్షన్ల ముందు ఇచ్చి .. మళ్లీ ఇప్పుడు
  • తొమ్మిదేండ్లలో బీసీ, ఎంబీసీ ఫెడరేషన్ల ద్వారా ఖర్చు చేసింది రూ.417 కోట్లే

హైదరాబాద్, వెలుగు: నాలుగేండ్లుగా బీసీలను పట్టించుకోని రాష్ట్ర సర్కార్.. ఎన్నికల వేళ సబ్సిడీ లోన్లు ఇచ్చేందుకు ప్లాన్​ రెడీ చేస్తున్నది. సరిగ్గా 2018 ఎన్నికల కంటే ముందు బీసీలు, ఎంబీసీలకు అమలైన సబ్సిడీలు ఆ తర్వాత ఆగిపోయాయి. రెండోసారి అధికారం వచ్చాక ఆ విషయాన్ని సర్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సబ్సిడీ లోన్లను తెరపైకి తెచ్చింది. గతంలో ఉన్నతాధికారులు పంపిన యాక్షన్ ప్లాన్​ను  ఆమోదించకుండా పక్కన పెట్టిన సర్కారు.. ఇప్పుడు ఫైల్ తెప్పించుకొని మరీ బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల నుంచి అమలు చేస్తున్న సబ్సిడీ లోన్ల యాక్షన్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండింటికి కలిపి రూ.603 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. బీసీల ఓటు బ్యాంకు కోసమే సర్కారు ఇదంతా చేస్తున్నదని, చిత్తశుద్ధి ఉంటే అన్ని సంవత్సరాలకు కలిపి రూ.5 వేల కోట్లతో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కేటాయింపులే తప్ప ఫండ్స్ ఇవ్వట్లే

బీసీ వెల్ఫేర్ ను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బీసీల కోసం ఏర్పాటు చేసిన 11 సమాఖ్యలకు నాలుగేండ్లుగా కేటాయింపులే తప్ప ఫండ్స్ రిలీజ్ చేయలేదు. పోయిన ఆర్థిక సంవత్సరం బీసీలకు వివిధ రూపాల్లో రాయితీ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ.1000 కోట్లు ఇస్తామని బడ్జెట్​లో ప్రకటించింది. కానీ, అమలు చేయలేదు. ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌కు ప్రభుత్వం వరుసగా మూడు బడ్జెట్లలో రూ.2,400 కోట్లు కేటాయించినా.. 100 కోట్లు కూడా రిలీజ్‌‌‌‌ చేయలేదు. తొమ్మిదేండ్లలో బీసీ, ఎంబీసీ కార్పొరేషన్​కు రూ.417 కోట్లే ఖర్చు చేసింది.  ఇప్పుడు సడన్​గా బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల నుంచి రూ.12 లక్షల దాకా 60 నుంచి 100 శాతం సబ్సిడీతో రుణాలందించేందుకు ప్లాన్ రెడీ చేసింది. అయితే, ప్రభుత్వం కేటాయించిన ఈ మొత్తంతో లక్ష మంది కంటే ఎక్కువ లబ్ధి చేకూరదని అంటున్నారు. బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం 5.70 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇప్పటికీ వాటికి లోన్లు మంజూరు చేయలేదు.

బీసీ బంధు ఏమైంది?

దళితబంధుతోపాటు మిగిలిన అన్ని వర్గాలకూ బంధు అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దళితబంధునే ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదు. బీసీ స్టూడెంట్స్​కు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్​మెంట్ కూడా చెల్లించలేకపోతున్నది. బీసీ సంఘాల ఏ ఒక్క ప్రతిపాదనను ప్రభుత్వం బడ్జెట్ లో పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ‘మేము ఎంతో మాకు అంత వాటా’ అనే బీసీల ఆకాంక్షను పట్టించుకోలేదు. ఈ సారి కేవలం సబ్సిడీ లోన్లతో సరిపెట్టాలని చూస్తున్నది.