ఇతర శాఖలకు వెళ్లిన వీఆర్ఏలకూ పే స్కేల్

ఇతర శాఖలకు వెళ్లిన వీఆర్ఏలకూ పే స్కేల్
  •     ఇతర శాఖలకు వెళ్లిన వారికి  జీతాలివ్వాలని సర్కారు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వివిధ శాఖల్లోకి సర్దుబాటు అయిన వీఆర్‌‌ఏలకు పే స్కేల్‌‌ ప్రకారం వేతనాలు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ బుధవారం సర్క్యులర్ ఇచ్చారు. ఇప్పటికే వారికి ఎంప్లాయీ ఐడీలు ఇవ్వగా.. ఇతర శాఖల్లో విధుల్లో చేరిన వారికి, క్రమబద్ధీకరణకు ఒప్పుకోకుండా ఏ శాఖలోనూ చేరనివారికి, ఏదేని కారణం వల్ల ప్రమోషన్ ఆగిపోయిన వీఆర్‌‌ఏలకూ వేతనం చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. 

రెవెన్యూ శాఖలోని వీఆర్‌‌ఏ వ్యవస్థను రద్దు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్‌‌ఏలను క్రమబద్ధీకరిస్తూ నిరుడు జులై 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. నిరుడు ఆగస్టులో 16,758 మందిని క్రమబద్ధీకరించగా..15,560 మంది విధుల్లో చేరారు.బుధవారం ఉదయం వీఆర్ఏ సంఘాల నాయకులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవగా.. అక్కడికక్కడే ప్రిన్సిపల్ సెక్రటరీని మంత్రి ఈ మేరకు ఆదేశించారు.