రేషన్ కార్డులకు అప్లికేషన్లు బంద్

V6 Velugu Posted on Jun 12, 2021

  • మీ–సేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న జనం 
  • రాష్ట్రవ్యాప్తంగా 5.63 లక్షల అప్లికేషన్లు పెండింగ్​ 
  • కొత్తగా దరఖాస్తు చేసేందుకు మరో 5 లక్షల మందికిపైగా ఎదురుచూపులు
  • సర్కారు ఇస్తామన్నది 4.46 లక్షల కార్డులే
  • గైడ్​లైన్స్​ రాలేదంటున్న సివిల్​ సప్లై ఆఫీసర్లు

హైదరాబాద్​/ మంచిర్యాల, వెలుగు: రేషన్  కార్డు దరఖాస్తులు తీసుకునుడు రాష్ట్ర సర్కార్ బంద్ పెట్టింది. కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజు నుంచే కొత్త అప్లికేషన్లు తీసుకోవద్దని ఆఫీసర్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కార్డుల కోసం ఎదురు చూస్తున్నోళ్లకు నిరాశ తప్పడం లేదు. కార్డులు ఇస్తామని సర్కార్ ప్రకటించడంతో దరఖాస్తు చేసుకునేందుకు జనం మూడు రోజులుగా మీ–సేవ సెంటర్లు, ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే లక్షల మంది అప్లయ్​ చేసుకున్నారని, కొత్త అప్లికేషన్లు తీసుకుంటలేమని ఆఫీసర్లు వెనక్కి పంపించేస్తున్నారు. అయితే, గతంలో దరఖాస్తు​ చేసుకున్నోళ్లకు కూడా కార్డులు అందేలా లేవు. 5.63 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4.46 లక్షల దరఖాస్తులే పెండింగ్‌లో ఉన్నట్టు చెప్తోంది. దీంతో ఇప్పటికే అప్లయ్​ చేసుకొని, ఏండ్లుగా ఎదురుచూస్తున్నోళ్లకు కూడా వస్తాయో లేవోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 
(మొదటి పేజీ తరువాయి)
సర్కారు చెప్పినట్లు 4.46 లక్షల మందికే కార్డులు ఇస్తే, ఇంకో 1.17 లక్షల మంది సంగతి ఏందన్న దానిపై క్లారిటీ లేదు. ఇదే విషయమై సివిల్​ సప్లయ్​ఆఫీసర్లను ప్రశ్నిస్తే.. ఇంకా గైడ్‌‌‌‌లైన్స్  రాలేరంటున్నారు. 

10 లక్షల మంది ఎదురుచూపులు

గత ఏడేండ్లుగా రేషన్​ కార్డుల కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సివిల్​ సప్లయ్స్​, డీఎస్‌‌‌‌వో  ఆఫీసుల్లో  5,63,411 రేషన్ కార్డుల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. మరో 5 లక్షలకు మంది కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు.  ప్రభుత్వం కార్డులు ఇవ్వడం లేదన్న ఉద్దేశంతో చాలా మంది ఇన్నాళ్లూ అప్లికేషన్లు పెట్టుకోలేదు. రేషన్​ కార్డులకు కేబినెట్​ ఓకే చెప్పడంతో వాళ్లంతా దరఖాస్తు చేసుకునేందుకు మూడురోజులుగా మీ సేవ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా అప్లికేషన్లు తీసుకోవడం లేదు.  కొత్త అప్లికేషన్ల కోసం వెబ్​సైట్​లో ఆప్షన్​ లేదని మీ సేవ నిర్వాహకులు అంటున్నారు. సదరు పోర్టల్​ లో ‘‘అప్లికేషన్  ఫర్  న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ సర్వీస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ప్రజెంట్’’ అని చూపిస్తోంది. ఇప్పటికే అప్లయ్​  చేసుకున్నవాళ్లు, చేసుకోవాల్సిన వాళ్లు కలిపి సుమారు పది లక్షల మంది ఉంటారని సివిల్ సప్లయ్స్​ ఆఫీసర్లు చెప్తున్నారు.

కేంద్రం ఆదేశాలతో  కదలిక 

రేషన్​ కార్డులు లేని వాళ్లు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా క్లియరెన్స్​ చేయకుండా గత ఏడేండ్లుగా రాష్ట్ర సర్కారు పక్కనపెడుతూ వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ప్రతి పేదవారికి  ఫ్రీగా రేషన్​ అందించాలని నిర్ణయించింది. నవంబర్​ వరకు ఉచితంగా రేషన్​ అందిస్తున్నట్లు ప్రకటించింది.  అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్​ నిర్వహించి ఫుడ్​ సెక్యూరిటీ కార్డులను అందించి ఆదుకోవాలని అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. దీంతో ఇన్నాళ్లూ రేషన్​ కార్డులపై అంటిముట్టనట్లు ఉన్న  రాష్ట్ర సర్కారు హుటాహుటిన రేషన్​ కార్డుల జారీకి  కసరత్తు షురూ చేసింది. అయితే.. కొత్తగా అప్లికేషన్లు తీసుకోకపోవడం, 4.46 లక్షల అప్లికేషన్​లే  పెండింగ్​లో ఉన్నాయని చెప్పడంపై జనం మండిపడుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డును కూడా సర్కారు ముద్రించి ఇవ్వలేదు. అయితే.. మీసేవా సెంటర్​లో ఇచ్చే స్లిప్​ల ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతోంది. ప్రతిసారీ ఇబ్బందవుతుండటంతో రేషన్  డీలర్లే ఒక కార్డులాంటిది రూ. 50కి ఇచ్చి పంపిణీ చేస్తున్నారు. కరోనా మొదలయ్యాక వేలిముద్రలు, ఐరిస్​లతో పాటు సెల్​ఫోన్ నంబర్​కు వచ్చే మెసేజ్ ఆధారంగా రేషన్ ఇస్తున్నారు.

ఏపీలో ఏడాదిలో 27 లక్షల కార్డులిచ్చిన్రు

రేషన్​ కార్డులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం 'నవశకం' పేరుతో ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించి, అర్హులను గుర్తించింది. విలేజ్ సెక్రటేరియట్​లో దరఖాస్తు తీసుకున్న 21 రోజుల్లో ఇంటి వద్దకే వచ్చి కుటుంబసభ్యుల ఈకేవైసీ ద్వారా వేలిముద్రలు సేకరించింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి రేషన్ కార్డులు అందజేసింది. ఏడాదిలో 33 లక్షల అప్లికేషన్లు పరిశీలించి 27 లక్షల కార్డులు పంపిణీ చేసింది. 

కార్డులు ఇస్తమన్నరు...సైట్​ బంద్​ పెట్టిన్రు 

నాకు నిరుడు పెండ్లయింది. ప్రస్తుతం వేరుగా ఉంటున్న. రేషన్ కార్డుకు అప్లయ్​ చేసుకుందామని మూడు రోజుల నుంచి  మీ‑–సేవ సెంటర్​ చుట్టూ తిరుగుతున్న. సైట్ ఓపెన్ అయితలేదని చెప్తున్రు. సీఎం కేసీఆర్​ రేషన్ కార్డులు ఇస్తమని చెప్పిండు. వెంటనే సైట్ బంద్​ చేసిన్రు. 
- ముత్తె మహేశ్​, లక్సెట్టిపేట, మంచిర్యాల జిల్లా 

15 రోజుల్లో సాధ్యమేనా..?

రాష్ట్రంలో 4,46,169 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని, 15 రోజుల్లోగా కొత్త కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని  ఆఫీసర్లను మంగళవారం కేబినెట్​ ఆదేశించింది. అయితే.. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్షకు పైగా అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. ఇందులో కేవలం 5,500 కార్డులు ఎంక్వైరీ పూర్తయి అప్రూవల్  కాగా... ఎంక్వైరీ చేయాల్సినవి 94,500కు పైనే ఉన్నాయి. మరి 15 రోజుల్లో 50 మంది సిబ్బందితో ఇన్ని అప్లికేషన్లు ఎంక్వైరీ చేయడం సాధ్యం కాదని అధికారులే చేతులెత్తేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లు కిరాయిదారులు కావడంతో ఇల్లు మారిన వారిని గుర్తించడం ఇబ్బంది అవుతుందని ఆఫీసర్లు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఇలానే ఉంది. ప్రతి జిల్లాలోనూ రేషన్ కార్డుల కోసం వేలల్లో అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

నాలుగేండ్లుగా తిరుగుతున్న

నాకు 2016లో పెండ్లయింది. తల్లిదండ్రులతో ఉన్న రేషన్ కార్డులో పేర్లు తొగించి కొత్త రేషన్ కార్డు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న. తల్లిదండ్రుల కార్డులో మా పేర్లను రెవెన్యూ ఆఫీసర్లు  తొలగించిన్రు. కానీ కొత్త రేషన్ కార్డు మంజూరు చేయలేదు. నాలుగేండ్లుగా ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్​ల చుట్టూ తిరిగినా పట్టించుకోలే. ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామని మీ సేవా సెంటర్​కు పోతే ఆప్షన్ లేదంటున్రు. 
- కోల అనిల్, జగిత్యాల

అప్లయ్​ చేసి రెండేళ్లు అయింది 

2019లో  రేషన్​ కార్డు కోసం అప్లయ్​ చేసిన. ఇప్పటి వరకు రాలేదు. గవర్నమెంట్​ ఇప్పుడు కొత్తగా రేషన్​ కార్డుల ప్రకటన చేసిన్రు. ఇప్పుడైనా ఇస్తరో లేదో అని డౌట్​ వస్తంది. 
- సిర్ల కావ్యశ్రీ, మల్కాజ్​గిరి, హైదరాబాద్​

Tagged KCR, TS Govt, apply, meeseva, accepting, new ration card applications

Latest Videos

Subscribe Now

More News