పనులు కావాలంటే 10 రోజుల తర్వాతే

పనులు కావాలంటే 10 రోజుల తర్వాతే
  • ‘పట్టణ ప్రగతి’లో అధికారులు బిజీ బిజీ

హైదరాబాద్, వెలుగు:ఈ నెల 3వ తేదీన గ్రేటర్​వ్యాప్తంగా ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం షురువైంది. అప్పటి నుంచి అన్ని జోన్లలోని మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో బిజీబిజీగా తిరుగుతున్నారు. కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలను దగ్గరుండి తొలగిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగనుంది.కాగా ఆఫీసర్లంతా ఫీల్డ్​లో ఉండడంతో ఆఫీసుల్లో అందే సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. పలు రకాల పనుల మీద ఆఫీసులకు వస్తున్న ప్రజలు అధికారులు లేరని తెలుసుకుని నిరాశతో వెనుదిరుగుతున్నారు. పనులు జరగాలంటే 10 రోజుల తర్వాత రావాలని కిందిస్థాయి సిబ్బంది చెప్పి పంపిస్తున్నారు.

ఉదయం నుంచే ఫీల్డ్​లో..
పట్టణ ప్రగతి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ఉదయం నుంచే అధికారులు ఫీల్డ్​లో ఉంటున్నారు. ఈ విషయం తెలియని చాలా మంది పనుల కోసం మున్సిపల్​ఆఫీసులకు వెళ్తున్నారు. లేటుగా అయినా ఆఫీసుకు వస్తారేమోనని ఆఫీసుల బయట ఉన్న చెట్ల కింద కూర్చుని ఎదురు చూస్తున్నారు. సంబంధిత డెస్కుల వద్ద సంప్రదించగా అర గంటలో వస్తారు.. గంటలో వస్తారని ఆఫీసు సిబ్బంది చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ హెడ్డాఫీసుతోపాటు శేరిలింగంపల్లి, చార్మినార్, ఎల్ బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, కూకట్​పల్లి జోనల్​ఆఫీసుల పరిధిలో 30 సర్కిల్ ఆఫీసులు ఉన్నాయి. డైలీ వందల మంది వివిధ పనుల నిమిత్తం ఈ ఆఫీసులకు వస్తుంటారు. మీ–సేవలో దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్ల వివరాలకు అని, ఇంటి నిర్మాణ పనులకు సంబంధించిన సమాచారం కోసం అని అధికారులను కలుస్తుంటారు. ప్రస్తుతం అధికారులంతా పట్టణ ప్రగతిలో బీజీ అవడంతో ఇలాంటి వారు కార్యాలయాలకు వచ్చి వెనుదిరుగుతున్నారు. 

క్షేత్ర స్థాయిలో..
కాలనీలు, బస్తీల్లోని సమస్యలను గుర్తించి ఆఫీసర్లు పనులు చేపడుతున్నారు. చెత్త తొలగింపు, భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు, బస్తీల్లో ముళ్ల పొదలు తొలగించడం వంటివి చేస్తున్నారు. అలాగే వానా కాలం దృష్ట్యా నాలాల పూడిక తీత పనులు, శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చడం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని గుంతలను పూడ్చివేయడం, దోమల నివారణకు స్ర్పేయింగ్, ఫాగింగ్ చేస్తున్నారు. మంచినీటి ట్యాంకులను క్లీన్​చేయిస్తున్నారు. పచ్చదనాన్ని మొక్కలు నాటుతున్నారు. ఇండ్ల ముందు పెంచుకునే మొక్కలను పంపిణీ చేస్తున్నారు. 

ఇప్పుడు కాదని చెప్పారు
కొత్త ఇంటికి సంబంధించి టాక్స్ అసెస్మెంట్ అప్లికేషన్ పనిమీద పెద్ద అంబర్ పేట మున్సిపల్​ఆఫీసుకు వెళ్లాను. అధికారులు లేరని, పట్టణ ప్రగతి కార్యాక్రమంలో ఉన్నారని అక్కడి సిబ్బంది చెప్పారు. ఏ పని అయినా 10 రోజుల తర్వాతే అని చెప్పారు. 

- వెంకటేశ్, పెద్ద అంబర్​పేట

సమాచారం కోసం వస్తే లేరు
ఇటీవలే ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టాం. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకునేందుకు మున్సిపల్​ఆఫీసుకు వెళ్లాం. కానీ అధికారులు ఫీల్డ్ కి వెళ్లారని తెలిసింది. ఏదో ఒక టైంలో వస్తారని చాలాసేపు ఆఫీసు బయట ఉన్న చెట్ల కిందే కూర్చున్నాను.

- మహేశ్, శేరిలింగంపల్లి