క్షమాభిక్షలో వివక్ష ఉంటే ఎట్లా?.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు

క్షమాభిక్షలో వివక్ష ఉంటే ఎట్లా?.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఒకే కేసులో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షలో ముగ్గురికి క్షమాభిక్ష పెట్టిన ప్రభుత్వం.. మరో ఇద్దరికి ఇవ్వకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. గత 27 ఏండ్లుగా జైల్లో ఉన్న నిందితుల్లో కొందరికి ఒకలా మరొకరికి ఇంకోలా వ్యవహరించడం వివక్ష కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే వ్యవహారంపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వానికి జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. 

ఒక కేసులో కింది కోర్టు 1997లో నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై అప్పీల్‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌ చేసింది. ఐదుగురిలో ముగ్గురికి మాత్రమే ప్రభుత్వం క్షమాభిక్ష కల్పిస్తూ ఆగస్టు 19న జీవో 51 జారీ చేసింది. ముగ్గురికి క్షమాభిక్ష ప్రసాదించి, ఇద్దరికి ఇవ్వకపోవడం వివక్ష కిందకే వస్తుందని, దీంతో తన తండ్రి మహ్మద్‌‌ ఇర్బాన్‌‌ అలీకి కూడా క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ అతని కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇదే కేసులో మరో ఖైదీ అరీఫ్‌‌ ఖాన్‌‌ కూడా కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశాడు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.