- అటెండ్ కానున్న 3.98 లక్షల మంది స్టూడెంట్లు
- 889 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన ఇంటర్ బోర్డు
- ఉదయం ఫస్టియర్.. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరిగే ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,98,358 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రతిరోజూ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ స్టూడెంట్లకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ స్టూడెంట్లకు పరీక్షలు జరుగుతాయి.
పరీక్ష ప్రారంభానికి గంట ముందే విద్యార్థులను సెంటర్లలోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 889 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 10,685 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 75 సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. అన్ని సెంటర్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హాల్‌టికెట్లపై ఏవైనా తప్పులున్నా, డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఇబ్బందులున్నా 040- 24655027 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల వివరాలు:
మొత్తం విద్యార్థులు: 3,98,358
ఫస్ట్ ఇయర్: 2,67,285
సెకండ్ ఇయర్: 1,31,073
పరీక్ష కేంద్రాలు: 889 (ప్రభుత్వ: 327, ప్రైవేట్: 460, ఇతర: 102)
