
రాష్ట్రంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. దీంతో ఫలితాలు ఎప్పుడని అటు విద్యార్థులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఫలితాలు కూడా వెలువడడంతో తెలంగాణలో రిజల్ట్స్ఎప్పుడన్న చర్చ జోరుగా నడుస్తోంది. అయితే.. అధికారులు మాత్రం ఫలితాలకు సంబంధించిన తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. .
గతంలో జరిగిన మిస్టేక్స్ మళ్లీ జరగకుండా ఉండేవిధంగా ఫలితాలను విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం మే 10న ఇంటర్మీడియట్ కు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫలితాలు వెలువడిన వారం రోజులకుల అంటే మే 17న టెన్త్ పరీక్షల ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్ ఇయర్ కు సంబంధించి 4,82,677 మంది, సెకండియర్ కు సంబంధించి 4,65,022 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. ఇందుకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ సైతం ఇప్పటికే పూర్తయింది.
ఇక టెన్త్ పరీక్షల విషయానికి వస్తే ఏప్రిల్ 03 న పరీక్షలు ప్రారంభం కాగా ఏప్రిల్ 12 న ముగిశాయి. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 4,84,384 మంది పరీక్షలు రాశారు. తెలుగు పేపర్, హిందీ పేపర్ లీకేజీ వ్యవహారాలు మినహాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.