హైదరాబాద్, వెలుగు : బర్కత్పుర పీఎఫ్ ఆఫీసు ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. ఆర్టీసీలో పనిచేస్తున్న సుమారు 1,600 మంది కార్మికులు, ఉద్యోగులు కేవైసీ ఫార్మ్లను పీఎఫ్ కమిషనర్ రిజెక్ట్ చేశారని ఆరోపించారు. ఆధార్ కార్డు, పీఎఫ్ రికార్డుల్లో ఉన్న రెండు పేర్లు ఒకటేనని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినా రిజెక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పీఎఫ్ కమిషనర్ పావనికి వినతిపత్రం అందజేశారు.
ఆర్టీసీ కార్మికులు అప్లై చేసుకున్న కేవైసీ ఫారం అనుమతించాలని వినతిపత్రంలో కోరారు. ఈ సమస్యపై ఆర్టీసీ మేనేజ్ మెంట్ తో చర్చిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి వెల్లడించారు. పీఎఫ్ అంశంలో ఉద్యోగి, యాజమాన్యానికి సంబంధించిన సర్వీస్ రికార్డులను ఆర్టీసీనే నిర్వహిస్తుందని తెలిపారు. హైయర్ పెన్షన్ అప్లైకి ఈ నెల11తో గడువు ముగుస్తుందని.. ఆ గడువును పొడిగించాలని రాజిరెడ్డి కోరారు.
