- గోల్ఫ్ కోర్సు, వెడ్డింగ్ డెస్టినేషన్లకు ప్లాన్: మంత్రి జూపల్లి
- అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కార్నివాల్
- నగరంలో హెరిటేజ్ వాక్‌లు, స్పెషల్ షటిల్ బస్సులు
- పర్యాటక అభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలి
- పీపీపీ, లీజు పద్ధతుల్లో పెట్టుబడులకు ఆహ్వానం..
- అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉన్న 1,600 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. అక్కడ స్టార్ హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్, వెడ్డింగ్ డెస్టినేషన్లు, గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లకు పర్యాటకుల తాకిడి పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం పర్యాటక సలహా మండలి సభ్యులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, మౌలిక వసతులు, కొత్త ప్రాజెక్టులపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా అంతర్జాతీయ స్థాయి ‘హైదరాబాద్ కార్నివాల్’ నిర్వహించాలన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్), లీజు విధానాలకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి స్పష్టం చేశారు. దీనికోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి అనువైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. వింటేజ్ కార్ల మ్యూజియం, స్కల్ప్చర్ వ్యాలీ, గ్రాఫిటీ విలేజ్ వంటి సరికొత్త కాన్సెప్టులతో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దన్నారు. నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు.
33 జిల్లాల్లో పర్యాటక శాఖ అధికారులను నియమించి, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు. పాతబస్తీలోని చార్మినార్, కోఠి, లాడ్ బజార్ వంటి ప్రాంతాల్లో హెరిటేజ్ వాక్‌లను విస్తరించాలని, పర్యాటకుల కోసం ఆర్టీసీ సహకారంతో ప్రత్యేక షటిల్ బస్సులను నడపాలని ప్రతిపాదించారు. తెలంగాణ వారసత్వ సంపదను చాటిచెప్పేలా వెబ్‌సైట్లు, బ్రోచర్లను అప్‌డేట్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, టీజీటీడీసీ ఎండీ గౌతమి, పర్యాటకశాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, సలహా మండలి సభ్యులు పాపారావు, రాందేవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
