హైదరాబాద్: రెవెన్యూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి స్పష్టం చేసింది. రికార్డుల సవరణ, మ్యుటేషన్, పాస్‌బుక్‌ల వంటి సమస్యలపై చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపింది.
నిర్ణీత సమయంలో దరఖాస్తులు క్లియర్ చేస్తే ఇలాంటి కేసులు కోర్టుకు రావని జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరి మ్యుటేషన్ అప్లికేషన్ పై వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. దరఖాస్తు ఇచ్చినప్పటి నుంచి సమస్య పరిష్కారం అయ్యే వరకు స్పష్టమైన ఎస్‌ఓపీ తేవాలని సూచిస్తూ విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.
