
నిర్మల్ జిల్లా: దేశంలోనే ప్రముఖ పుణ్య క్షేత్రం బాసర అభివృద్దిని సర్కార్ మర్చిపోయిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సోమవారం నిర్మల్ జిల్లాలోని బీజేపీ ఆఫీసులో మాట్లాడారు వివేక్. సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా బాసర క్షేత్రానికి రాకపోవడం దురదృష్టకరమన్న ఆయన..రైతులను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిన కేసీఆర్, లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయడం లేదన్నారు. తెలంగాణ రైతాంగం చాలా బాదల్లో ఉందని, దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉందని తెలిపారు.
కాకా వెంకటస్వామి గారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం చాలా కృషిచేశారని తెలిపారు. కమీషన్ల వస్తున్నాయన్న అధికార మదంతో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు అని తెలిపిన వివేక్..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగుకు నిరందించే ప్రాజెక్టులు నిర్మించాలన్నారు.
గోదావరి నదిలో గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చు అధికంగా ఉండదని..మొన్నటి ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యే 20 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ప్రస్తుతం వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి 20 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్లేనని.. ప్రజాస్వామిక తెలంగాణకి బదులు, కల్వకుంట్ల ఫ్యామిలీకి, కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే తెలంగాణగా మార్చారని తెలిపారు వివేక్ వెంకటస్వామి