బీజేపీ జాతీయ కార్యవర్గంలో  రాష్ట్రానికి పెద్దపీట

బీజేపీ జాతీయ కార్యవర్గంలో  రాష్ట్రానికి పెద్దపీట
  • ఎగ్జిక్యూటివ్​ మెంబర్లుగా కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, 
  • జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు
  • ప్రత్యేక ఆహ్వానితులుగా విజయశాంతి, ఈటల రాజేందర్

న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. నలుగురికి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా, ఇద్దరికి  ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ అవకాశం కల్పించింది. జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ చీఫ్​ నడ్డా గురువారం ప్రకటించారు. వివరాలను జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 80 మందిని నేషనల్​ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా, 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా, 179  మందిని శాశ్వత ఆహ్వానితులు (ఎక్స్ అఫిషియో)గా బీజేపీ ప్రకటించింది. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావును నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు.  ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి, మాజీ మంత్రి, హుజూరాబాద్  అభ్యర్థి ఈటల రాజేందర్ కు అవకాశం కల్పించారు. అదేవిధంగా జాతీయ ఆఫీస్  బేరర్లలో తెలంగాణ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఏపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరికి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు చోటు లభించింది. శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్లమెంటరీ పార్టీ ఆఫీసు సెక్రటరీ కామర్స్​ బాల సుబ్రమణ్యం(ఏపీ), తెలంగాణ ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్, స్టేట్ చీఫ్​ బండి సంజయ్, తెలంగాణ శాసనసభ పక్ష నేత రాజా సింగ్, స్టేట్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్​ను నియమించారు. 
అన్ని వర్గాలకు ప్రాధాన్యం
బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుంచి అన్ని వర్గాలకు న్యాయం దక్కిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను నిత్యం జనంలో ఎండగట్టే వారికి అవకాశం కల్పించారని సీనియర్ నేత ఒకరు చెప్పారు. తెలంగాణలోని ఉత్తర, దక్షిణ, సెంట్రల్ ప్రాంతాలకు కూడా వీరి నియామకంతో న్యాయం జరిగినట్లయిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల టైం ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కావడం కోసమే ఆయా ప్రాంతాలకు సంబంధించిన లీడర్లకు జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు.
నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ:
ప్రధాని మోడీ, సీనియర్ లీడర్లు ఎల్​కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్​ సహా 80 మందికి నేషనల్​ ఎగ్జిక్యూటివ్​ కమిటీలో చోటుదక్కింది. తెలంగాణ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు జి. వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డి, గరికపాటి ఉన్నారు. కర్నాటక నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు అవకాశం దక్కింది.