
కొనుగోలు చేసిన వ్యక్తికి సకాలంలో ఫ్లాట్ అప్పగించని బిల్డర్‌పై రాష్ట్ర వినియోగదారుల ఫోరం కొరడా ఝుళిపించింది. వినియోగదారుడు చెల్లించిన రూ. 49,24,359లను 18 శాతం వడ్డీతో సహా వాపస్ చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన నూపూర్ అంచిలియా, అభిషేక్ అంచిలియా దంపతులు రంగారెడ్డి జిల్లా నానక్‌రాంగూడలో మంత్రి డెవలపర్స్ నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. దాని విలువ రూ.50,44,080 కాగా.. 2011లో వారు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.లక్ష పోనూ బ్యాంకు లోన్ తీసుకొని మిగతా రూ. 49,24,359 చెల్లించారు.
అగ్రిమెంట్ ప్రకారం జులై 1న, 2013 వరకు ఫ్లాట్ పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. అయితే నిర్మాణ పనులను పూర్తి చేయడంలో సదరు కంపెనీ విఫలమైంది. ఏప్రిల్ 2016 వరకు ఫ్లాట్ ఇవ్వలేకపోయారు. దీంతో కొనుగోలుదారులు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారించిన కమిషన్ చైర్మన్ ఎంఎస్‌కే జైశ్వాల్ వినియోగదారుడు చెల్లించిన రూ .49,24,359 డుబ్బును18 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని మంత్రి డెవలపర్స్‌ను ఆదేశించారు. ఇందుకు నాలుగు వారాల గడువును విధించారు. డబ్బులు చెల్లించిన తేదీ నుంచి వడ్డీ వర్తిస్తుందని, వినియోగదారుడు కూడా బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాన్ని చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కోర్టు ఖర్చుల కింద ఫిర్యాదుదారులకు రూ.5000 ఇవ్వాలని మంత్రి డెవలపర్స్‌ను ఆదేశించారు.