
- నాలుగు డిపార్ట్మెంట్లలో కొత్త పోస్టులు మంజూరు
- రెవెన్యూ శాఖలో 5,243, ఇరిగేషన్లో 5,063 పోస్టులు
హైదరాబాద్, వెలుగు: వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కారు సూపర్ న్యుమరరీ పోస్టులను క్రియేట్ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణా రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల్లో మొత్తం 14,954 పోస్టులను ప్రభుత్వం క్రియేట్ చేసింది. అందులో రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 2,113 రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు, 679 సబార్డినేట్ పోస్టులుగా గుర్తించింది. అలాగే మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 1,266 వార్డు ఆఫీసర్ పోస్టులు, ఇరిగేషన్లో 5,063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథ శాఖలో 3,372 హెల్పర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో మొత్తం 20,555 మంది వీఆర్ఏలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. వాటిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల్లో 5,601 మంది వీఆర్ఏలను సర్దుబాటు చేసేందుకు వీలుంది. మిగిలిన వారి సర్దుబాటు కోసం కొత్త పోస్టులను మంజూరు చేసింది. 61 ఏండ్లలోపు ఉన్నోళ్లు 16,758 మంది ఉండగా.. ఆపై వయసున్న వారు 3,797 మంది ఉన్నారు. 61 ఏండ్ల పైన ఉన్న వీఆర్ఏలకు వారసత్వంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా, వీఆర్ఏల సర్దుబాటును పూర్తి చేయాలంటూ ఇటీవలే కలెక్టర్లకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.