
- రేపు ఉన్నతవిద్యామండలి ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రామ్: టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ పూర్తయి అండర్ గ్రాడ్యుయేట్‌లోని వివిధ కోర్సుల్లోకి వెళ్లే విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ), తెలంగాణ స్కిల్స్, అకడమిక్స్అండ్ ట్రైనింగ్ (టీసాట్) ఆధ్వర్యంలో సోమవారం స్పెషల్ లైవ్ప్రోగ్రామ్ను నిర్వహించనున్నట్టు టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
ఇంజనీరింగ్, డిగ్రీ తదితర కోర్సుల ఎంపికలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీసాట్ నిపుణ చానెల్లో రెండు గంటల పాటు ప్రసారమవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ఫ్రొఫెసర్డాక్టర్ వి. బాలకిష్టా రెడ్డి హాజరై సలహాలు, సూచనలు ఇస్తారని వివరించారు. ఆయనతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా మాట్లాడి అనుమానాలు తీర్చుకోవచ్చని వెల్లడించారు. ఇటు ఉన్నతవిద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ పురుషోత్తం, ప్రొఫెసర్ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్‌లు సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులు ఈ లైవ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.