మే 7 నుంచే టీఎస్​ఎప్ సెట్.!

మే 7 నుంచే  టీఎస్​ఎప్ సెట్.!

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  రాష్ట్రంలో  పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ తేదీలు మారనున్నాయి. ఇప్పటికే పాలిసెట్ ఎగ్జామ్ డేట్ మారగా, టీఎస్​ ఎప్​సెట్ (ఎంసెట్) తేదీలూ ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మే 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ , జూన్ 4న రిజల్ట్ ఉంటుందని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మే 9 నుంచి 12 వరకూ జరిగే ఎప్ సెట్ పరీక్షలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్​లైన్ ఎగ్జామ్స్ కావడంతో, ఇతర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పరీక్ష తేదీలను నిర్ణయిస్తున్నారు. 

మే 8న ఏపీ ఈసెట్ ఉండటంతో మే 7 నుంచి టీఎస్​ ఎప్ సెట్ పరీక్షలను ప్రారంభించాలని ప్రైమరీగా నిర్ణయించినట్టు తెలిసింది. మే 7, 9, 10, 11 తేదీల్లో ఎప్ సెట్ పెట్టాలని భావిస్తోంది. ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ తేదీలు మినహాయిస్తే, మళ్లీ జూన్ మూడో వారంలోనే ఖాళీగా ఉన్నాయి. దీంతో సాధ్యమైనంత వరకు మేలో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ షెడ్యూల్​ను సర్కారు దృష్టికి ఉన్నత విద్యాశాఖ అధికారులు తీసుకెళ్లారు. మరోపక్క ఫలితాల రోజే  జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించే ఐసెట్ తేదీని మార్చనున్నారు.