ఎస్టీ కేటగిరీ కొత్త రోస్టర్ నేపథ్యంలో టీఎస్​పీఎస్సీ చర్యలు

ఎస్టీ కేటగిరీ కొత్త రోస్టర్ నేపథ్యంలో టీఎస్​పీఎస్సీ చర్యలు

త్వరలో డిపార్ట్​మెంట్లతో కమిషన్ మీటింగులు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 నోటిఫికేషన్ పై మళ్లీ కదలిక మొదలైంది. ఇప్పటికే పలు డిపార్ట్​మెంట్లు ఖాళీల డేటా ఇవ్వగా, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో వాటిలో మార్పులు చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును టీఎస్​పీఎస్సీ మొదలుపెట్టింది. విద్యా, ఉద్యోగ నియామకాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, రాష్ట్రంలో 663 గ్రూప్ 2 పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా డిపార్ట్​మెంట్ల నుంచి రోస్టర్ తో కూడిన ఖాళీల వివరాలు టీఎస్పీఎస్సీకి అందాయి. 

కానీ ప్రస్తుతం ఎస్టీ రోస్టర్ మారడంతో, దానికి అనుగుణంగా మార్పులు చేసి పంపించాలని టీఎస్​పీఎస్సీ అధికారులు ఆయా శాఖలను కోరారు. దీనికి సంబంధించి టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం నుంచి డిపార్ట్​మెంట్లతో సమావేశాలు నిర్వహించనుంది. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత రోస్టర్ కు తుది మార్పులు చేయనున్నారు.