గ్రూప్ 1 ఇంటర్వ్యూ తీసేయడంపై రూమర్స్ సరికాదు

గ్రూప్ 1 ఇంటర్వ్యూ  తీసేయడంపై రూమర్స్ సరికాదు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్ 1 పరీక్ష నిర్వహించబోతోంది. రేపు (అక్టోబరు  16న) ఈ ఎగ్జామ్ జరుగనుంది. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డితో v6 ముచ్చటించింది. పరీక్ష నిర్వహణకు చేసిన ఏర్పాట్లు ఏమిటి ? అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? తదితర విషయాలను ఆయన వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఇచ్చినటు వంటి నోటిఫికేషన్ కు భారీ స్పందన వచ్చిందని, 3 లక్షల 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 33 జిల్లాల్లో 1019 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 2 లక్షల 95 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లౌడ్ చేసుకున్నారని వెల్లడించారు. డౌన్ లౌడ్ చేసుకోని వారందరికీ ఎస్ఎంఎస్ లు పంపించామన్నారు.  

రెండు నెలల్లో ఫలితాలు..

అప్ లోడ్ చేసుకున్న వివరాలను ఎప్పుడైనా అభ్యర్థులు చూసుకోవచ్చని, సరైన సమాచారం పొందుపర్చకపోతే  సరిచేసుకొనే అవకాశం ఉందన్నారు. రాసిన పరీక్ష పేపర్ ను.. ఓఎంఆర్ షీట్ ను అభ్యర్ధులు చూసుకోవచ్చన్నారు. అయితే 3.80 లక్షల దరఖాస్తులను తాము స్కానింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనికి కొంత టైం పడుతుందన్నారు. వెబ్ సైట్ లో ఓఎంఆర్ షీట్ పెట్టిన అనంతరం కీ కూడా ఒకేసారి పెట్టడానికి కనీసం వారం నుంచి పది రోజులు పడుతుందన్నారు.  రెండు నెలల్లో ఫలితాలు విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తామన్నారు. ఈ నెలలోనే ప్రిలిమ్స్ ఫలితాలు.. ఫిబ్రవరిలో మెయిన్స్ ఫలితాలు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రూప్ -2 నోటిఫికేషన్ త్వరగా విడుదల చేస్తామని.. గ్రూప్ -4  విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నామన్నారు. గ్రూప్ 1లో ఇంటర్వ్యూ తీసివేయడంపై వస్తున్న రూమర్స్ లను ఆయన కొట్టిపారేశారు. 

అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాల్సినవి...

  • గోరింటాకు, స్మార్ట్ వాచ్ లకు అనుమతి లేదు.
  • చెప్పులతో రావాలి.. బూట్లతో రాకూడదు.
  • చేతులు, కాళ్లకు అలంకరణలు ఉండవద్దు.
  • ఒకరి పేరిట మరొకరు వచ్చినా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
  • ఓఎంఆర్ పత్రంలో వైట్నర్, బ్లేడ్, రబ్బర్ వాడితే పత్రాన్ని అనర్హమైనదిగా గుర్తిస్తారు.
  • పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్ధులు బయటకు వెళ్లడానికి వీలు లేదు. 
  • ప్రశ్నాపత్రంపై జవాబులను ఎట్టి పరిస్ధితుల్లో మార్క్ చేయకూడదు.