- పంటచేనులో అత్యాచారం చేసి.. ఇంటికి తీసుకొచ్చి
- ఉరివేసి చంపినట్టు బంధువుల ఆరోపణ
- గంజాయి మత్తులో నలుగురు యువకులు
- దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం
- నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆందోళన
వర్ధన్నపేట/రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లాలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాయపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి(21)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. రావూరు సీత్యా తండాకు చెందిన ఓ యువకుడు, తన ముగ్గురు స్నేహితులతో కలసి యువతిని మొక్కజొన్న తోటలోకి లాక్కెళ్లి రేప్ చేసి.. అక్కడి నుంచి ఆమెను ఇంటికి తీసుకువచ్చి ఉరి వేసి చంపారని పేర్కొంటున్నారు. యువతి నర్సంపేటలో నర్సింగ్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకులు ఆమెను బయటికి తీసుకొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. బుధవారం ఉదయం యువతి ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ తీవ్ర రక్త స్రావంతో ఉండగా గమనించిన బంధువులు ఆమెను కిందికి దింపి చూడగా అప్పటికే మృతి చెందినట్టు తెలిసింది. స్థానికుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న రాయపర్తి పోలీసులు.. కేసు నమోదు చేసి యువతి డెడ్‌బాడీని వర్ధన్నపేట ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు. రావూరుకు చెందిన గంజాయి బ్యాచ్ ఈ దారుణానికి పాల్పడిందని వారు తెలిపారు. విషయం తెలిసినప్పటికీ రాయపర్తి పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిందితులు ఎవరో చెబుతున్నా.. వారిని అదుపులోకి తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకొని న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు బాడీని అప్పగించారు.
ఏకేతండా పరిసరాల్లో గంజాయి బ్యాచ్!
రాయపర్తి మండలంలోని ఏకే తండా డంపింగ్ యార్డు ఏరియాలో కొందరు యువకులు నిత్యం గంజాయి తీసుకుంటూ హల్ చల్ చేస్తున్నట్టు సమాచారం. అన్నారానికి చెందిన ఓ వ్యక్తి గంజాయి సప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది. గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది.. ఎవరు తీసుకుంటున్నారు.. అనేది తెలిసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
