టీఎస్‌పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్‌ రెడ్డి రాజీనామా

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్‌ రెడ్డి రాజీనామా

టీఎస్‌పీఎస్సీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే  ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేయగా ఆ మరుసటి రోజు ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు.  తాజాగా  కారం రవీందర్‌ రెడ్డి  కూడా రాజీనామా చేశారు.  టీఎస్‌పీఎస్సీలో సిబ్బంది కొరత ఉన్నా నియామక ప్రక్రియ వేగవంతం చేశామన్నారు  రవీందర్‌ రెడ్డి.   

ఇద్దరి తప్పిదానికి సంస్థ మనుగడకే నష్టం వచ్చిందన్నారు ఆయన..  సంబంధం లేని వ్యక్తులు సైతం అపవాదు మోస్తున్నారన్నారు. తాము ఉద్యమకారులమని,  ఎప్పుడూ నిరుద్యోగుల పక్షానే నిలబడతామంటూ  రవీందర్‌ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.  

టీఎస్‌పీఎస్సీలో మొత్తం ఐదుగురు మెంబర్లున్నారు. ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్రానంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆర్.సత్యనారాయణ 2021 మే 21న సభ్యులుగా చేరారు. తాజాగా  రవీందర్ రెడ్డి రాజీనామాతో అందరూ రాజీనామా చేసినట్టు అయింది.  

గ్రూప్1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. దీంతో అప్పటికే నిర్వహించిన ఆయా పరీక్షలను టీఎస్​పీఎస్సీ రద్దు చేసింది. కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ లీకులతో సంబంధం ఉన్న సుమారు వంద మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే కమిషన్ సెక్రటరీపై గానీ, సెక్షన్ ఆఫీసర్‌‌పై గానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనలు చేశారు.

మరోపక్క నిరసనల మధ్యనే రెండోసారి గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహించారు. కానీ ఈ ఎగ్జామ్ విషయంలో కూడా నిబంధనలు అమలు చేయలేదనే ఆరోపణలతో హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో నిరుద్యోగుల్లో టీఎస్​పీఎస్సీపై నమ్మకం తగ్గింది. కమిషన్ చైర్మన్, సెక్రటరీ సహా మెంబర్లను తొలగించాలనే నిరుద్యోగులు, రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీకి ఎన్నికలు రావడంతో ప్రతిపక్షాలకు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా పలు పోటీపరీక్షల షెడ్యూల్‌తో కూడిన జాబ్ క్యాలెండర్‌‌ను రిలీజ్ చేసింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవి నుంచి జనార్దన్ రెడ్డి తప్పుకున్నారు.