
- ఉద్రిక్తంగా మారిన టీఎస్‌పీఎస్సీ ఆఫీసు ముట్టడి
- వందలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. పుస్తకాలు చదువుతూ నిరసన
- పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ లేక ఇబ్బంది పడ్తున్నమని ఆవేదన
- మద్దతు తెలిపిన కోదండరాం, అద్దంకి
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వరుసగా పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 రాయడం ఇబ్బందిగా మారుతుందని, వెంటనే వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ వచ్చేదాకా కదిలేది లేదంటూ వందల మంది కమిషన్ ఆఫీసు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వాళ్లపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అరెస్ట్ చేసి.. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ర్యాలీగా తరలివచ్చి..
ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే.. వరుస పరీక్షలతో గ్రూప్ 2 రాయడానికి ఇబ్బంది అవుతుందని, దాన్ని పోస్ట్‌పోన్ చేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు కోరుతూ వస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ నుంచి స్పందన లేకపోవడంతో గురువారం నాంపల్లిలోని కమిషన్ ఆఫీసు ముందు సామూహిక పఠనం కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉదయమే వివిధ ప్రాంతాల నుంచి ర్యాలీగా అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు. అయితే టీఎస్‌పీఎస్సీ ఆఫీసు ముందు పోలీసులు బారికేడ్లు పెట్టి, భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులను పక్కనే ఉన్న గ్రౌండ్‌కు తరలించారు. వాయిదా వేసే దాకా కదిలేది లేదని అభ్యర్థులు తేల్చిచెప్పారు. వారికి టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, రియాజ్, ఓయూ జేఏసీ నేత సురేష్ , ఎన్ఎస్యూఐ నేత బల్మూరి వెంకట్ తదితరులు మద్దతు తెలిపారు.
పుస్తకాలు చదువుతూ నిరసన
టీఎస్‌పీఎస్సీ తీరుకు వ్యతిరేకంగా గ్రూప్ 2 అభ్యర్థులు రోడ్డుపై పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఐదారుగురు అభ్యర్థులను అధికారులను కలిపించేందుకు టీఎస్‌పీఎస్సీ ఆఫీసు లోపలికి తీసుకుపోయారు. అయితే చైర్మన్ జనార్దన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో కమిషన్ సెక్రటరీ అనితారాంచంద్రన్, టీఎస్‌పీఎస్సీ మెంబర్ లింగారెడ్డిని ఆ అభ్యర్థులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. అయితే, గ్రూప్ 2 వాయిదా అంశంపై రెండు, మూడు రోజుల్లో కమిటీలో చర్చించి తమ నిర్ణయం ప్రకటిస్తామని అభ్యర్థులకు అధికారులు చెప్పినట్లు తెలిసింది.
పోలీసుల హెచ్చరికలు.. అరెస్టులు
గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ కదిలేది లేదని అభ్యర్థులు ప్రకటించడంతో వారితో డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆందోళన ఆపకపోతే అరెస్టు చేస్తామని, కేసులు పెడ్తామని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే రెండు, మూడు గంటల టైమ్ ఇచ్చామని డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌తో స్పష్టమైన ప్రకటన చేయించాలని అభ్యర్థులు నినాదాలు చేశారు. ఇదే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాగా, టీఎస్‌పీఎస్సీ ఆఫీసు చుట్టుపక్కల యువత ఎక్కడ కనిపిస్తే అక్కడ పోలీసులు అడ్డుకుని వారిని పోలీస్ వ్యాన్లలో ఎక్కించారు. సాధారణ పనుల కోసం వచ్చిన వాళ్లను అదుపులోకి తీసుకోవడంతో వారంతా రివర్స్ అయ్యారు. ముట్టడికి తమకూ సంబంధం లేదని పోలీసులపై మండిపడ్డారు.
అన్నీ పరీక్షలు ఒకేసారి పెడ్తే ఎట్ల?
గ్రూప్ 2 అభ్యర్థులు మాట్లాడుతూ.. ఈ నెల 23 వరకు గురుకుల బోర్డు పరీక్షలున్నాయని, వచ్చే నెలలో టెట్, జేఎల్ ఎగ్జామ్స్ ఉన్నాయని, ఇదే సమయంలో గ్రూప్ 2కు ప్రిపేర్ కావడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టులో పిటిషన్
గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించేలా టీఎస్‌పీఎస్సీ వరుసగా పరీక్షలను నిర్వహిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. గురుకుల ఉపాధ్యాయ పరీక్ష, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ తదితర నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 29, 30వ తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. దీనిపై జూన్ 26న, జులై 24న రెండుసార్లు టీఎస్‌పీఎస్సీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందించలేదన్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.