
అసిస్టెంట్ ఇంజనీర్(AE) పరీక్ష రద్దుపై మార్చి 15న నిర్ణయం తీసుకుంటామని టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధర్ రెడ్డి ప్రకటించారు. పూర్తి నివేదిక వచ్చాకా ఎగ్జామ్ రద్దు చేయాలా వద్దా అనేది చెప్తామన్నారు. ఎగ్జామ్ పేపర్ లీక్ పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం లేదని చెప్పారు. టీఎస్ పీఎస్సీలో రాజశేఖర్ రెడ్డి ఆరేళ్లుగా నెట్ వర్క్ ఎక్స్ పర్ట్ గా పనిచేస్తున్నాడని అతనికి ఐపీ అడ్రస్ లు అన్నీ తెలుసన్నారు. రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ ఇద్దరు కలిసే పేపర్ లీక్ చేశారని వెల్లడించారు. లీక్ అయిన పేపర్ ను ప్రవీణ్ రూ.10 లక్షలకు అమ్మిండని చెప్పారు. పేపర్ తీసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ రాశారని చెప్పారు.
తమ కుటుంబ సభ్యులెవరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలేదని జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తన కూతురు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పేపర్ లీక్ కేసును సిట్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు టీఎస్ పీఎస్సీ ద్వారా 26 నోటిఫికేషన్లు ఇచ్చామని వెల్లడించారు. గ్రూప్ 1 లో నిందితుడు ప్రవీణ్ కు వచ్చిన 103 మార్కులే టాప్ మార్కులు కావన్నారు. ప్రవీణ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారని చెప్పారు.